మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై ఎంపీ ధర్మపురి అర్వింద్ షాకింగ్ కామెంట్స్

హైదరాబాద్ సంస్థానం విలీనం అంశంలో నెహ్రూ పాత్ర సున్నా అని, పటేల్ వల్లే హైదరాబాద్ సంస్థానానికి చెందిన ప్రజలకు విముక్తి లభించిందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శలు చేశారు.

Update: 2023-09-16 15:33 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ సంస్థానం విలీనం అంశంలో నెహ్రూ పాత్ర సున్నా అని, పటేల్ వల్లే హైదరాబాద్ సంస్థానానికి చెందిన ప్రజలకు విముక్తి లభించిందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ విమోచన దినోత్సవంపై రకరకాలుగా చెప్పుకుంటారని, గతంలో కొందరు దేశాన్ని 17 ముక్కలుగా చేయాలని చూశారని చెప్పారు. కొందరు హైదరాబాద్‌ను పాకిస్థాన్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేశారన్నారు.

హైదరాబాద్ సంస్థానం విలీనం కోసం బూర్గుల రామకృష్ణ రావు, కొండా రంగారెడ్డి నెహ్రూను కలిస్తే, అందుకు ఆయన ఒప్పుకోలేదన్నారు. ఆయన ఒప్పుకోకపోవడంతో వారు వెళ్లి అప్పటి హోంశాఖ మంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను కలిశారని, అప్పుడు ఆయన మిలిటరీని పంపించి విలనీం చేయించారని తెలిపారు. ఇలా చేసినందుకు బూర్గుల, కొండాను పార్టీ నుంచి ఎక్స్‌పెల్ చేశారని, నిజాం నుంచి రహస్య ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారని ఆయన పేర్కొన్నారు. ఇకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ అవసరాల కోసం ఏమైనా చేస్తారని, విముక్తి కల్పించిన దినోత్సవాన్ని సమైక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నారని ఆయన విమర్శలు చేశారు.

అనంతరం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ.. నీచాతి నీచమైన కాంగ్రెస్ కూడా విమోచన దినోత్సవం నిర్వహిచేస్తుందంటే అది బీజేపీ వల్లే సాధ్యమైందని అన్నారు. సీడబ్ల్యూసీ మీటింగ్ కూడా హైదరాబాద్‌లో పెట్టుకున్నారని, ఇది సిగ్గుమాలిన చర్య కాదా అని అర్వింద్ విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేతలు దశాబ్దాల పాటు పాలించారని, ఎన్నడూ విమోచన దినోత్సవం ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో జరిగేది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్ కాదని, అది ఇటాలియన్ కాంగ్రెస్ మీటింగ్ అని ఆయన చురకలంటించారు.

ఎంఐఎం కూడా విమోచన దినోత్సవం నిర్వహిస్తుందంటే దానికి కారణం బీజేపీయేనని ఆయన చెప్పారు. విలీనం అంశం నెహ్రూ డీల్ చేసి ఉంటే హైదరాబాద్ కూడా.. పాకిస్తాన్ ఆక్యుపైడ్ హైదరాబాద్ అయ్యేదన్నారు. నెహ్రూ లాంటి యాంటీ నేషనల్ వ్యక్తి కాంగ్రెస్‌ను నడిపించడం వల్లే.. నేషనలిస్టులంతా ఒక్కటయ్యారన్నారు. బీజేపీ ఇప్పటి వరకు బలంగా ఉందంటే.. దానికి నెహ్రూ యాంటీ నేషనల్ ఎలిమెంటే కారణమన్నారు. సీడబ్ల్యూసీ సమావేశాలను రాహుల్ గాంధీ లీడ్ చేయాలని, అప్పుడు ఉన్న డిపాజిట్లు కూడా కోల్పోతారని ఆయన ఎద్దేవాచేశారు.

Tags:    

Similar News