కాంగ్రెస్ సవాలుగా ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికలు..! అభ్యర్థులు గెలిచేలా సీఎం రేవంత్ పక్కా వ్యూహం
ఉమ్మడి పాలమూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, ఎంపీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి సవాలుగా మారనున్నాయి.
దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: ఉమ్మడి పాలమూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, ఎంపీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి సవాలుగా మారనున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న 14స్థానాలకు గాను ఏకంగా 12స్థానాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి రావడంతో ఆ పార్టీ శ్రేణులలో ఉత్సాహం నెలకొంది. పదేండ్ల తర్వాత అధికారంలోకి రావడం, ఉమ్మడి పాలమూరు జిల్లా వాసి రేవంత్ రెడ్డి సీఎం కావడంతో పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నాయి. అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, ఎంపీ ఎన్నికలు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు అగ్ని పరీక్షలు తెచ్చిపెట్టాయి.
ఎమ్మెల్సీ ఎన్నికలలో బలం తక్కువే..!
ఎమ్మెల్సీ ఎన్నికలలో మొత్తం 1439 మంది స్థానిక సంస్థల ఓటర్లు ఉన్నారు. వీరిలో 850 కి పైగా బీఆర్ఎస్ ఓటర్లు ఉండగా, 350 వరకు కాంగ్రెస్, 150 దాకా బిజెపి , మిగతా ఇతర ఓటర్లు ఉన్నారు. ఇటువంటి సమయంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో ఉన్న జీవన్ రెడ్డిని గెలిపించుకోవడం సులభతరం కాకపోయినా.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అయిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు గత ప్రభుత్వంపై కోపంగా ఉండడం, తమకు తగినంత ప్రాధాన్యతన ఇవ్వకపోవడం కారణంగా ఈ ఎన్నికలలో వారంతా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారనే నమ్మకంతో జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచారు.
ఇందుకోసం ఇప్పటికే తమదైన శైలిలో ఇతర పార్టీల ఓటర్లతో సంప్రదింపులు జరిగినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఈ విధమైన ఆలోచనలతో ముందుకు సాగుతూ ఉండగా బీఆర్ఎస్ తమకు ఉన్న అనుకూల పరిస్థితులను జారవిడుచుకోవద్దు అన్న పట్టుదలతో ఉన్నారు. తమ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డిని గెలిపించుకుని తిరిగి తమ సత్తా చాటుకోవాలన్న ఉద్దేశంతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యవేక్షణలో మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఉమ్మడి పాలమూరు జిల్లా మాజీ ఎమ్మెల్యేల పర్యవేక్షణలో ఓటర్లు చె జారకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నీ గెలిపించుకోవడం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సవాల్ కానుంది.
ఎంపీ ఎన్నికల్లోనూ గట్టి పోటీ..
వచ్చే పార్లమెంటు ఎన్నికలలోను కాంగ్రెస్ పార్టీ బీజేపీ, బీఆర్ఎస్ నుంచి గట్టి పోటీని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణ, బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి పోటీ పడబోతున్నారు. ఇక్కడ ఎన్నికలు గతంలో మాదిరి కాకుండా నువ్వా నేనా అన్నట్లు సాగే పరిస్థితులు కనబడుతున్నాయి. పోటీలో ఉన్న సీడబ్ల్యుూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు, పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న మరో ఆరుగురు ఎమ్మెల్యేలపై ఉంటుంది.
నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలోను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ మల్లురవి, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీజేపీ అభ్యర్థిగా భరత్ ప్రసాద్ పోటీ పడబోతున్నారు. నియోజకవర్గంలోనూ గత అసెంబ్లీ ఎన్నికలలో జరిగిన తప్పిదాలు పార్లమెంట్ ఎన్నికలలో జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యేలు పట్టుదలగా ఉన్నారు. మరోవైపు బీజేపీకి ఓటు బ్యాంకు పెద్ద ఎత్తున పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడినుంచి పోటీ చేయనున్న మల్లు రవిని గెలిపించుకునే విషయంలో ఎమ్మెల్యేలు అంతా కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంటుంది.
అలంపూర్, గద్వాల ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ వారు కావడం, ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై కూడా కొన్ని విమర్శలు వస్తున్న నేపథ్యంలో పార్టీ అభ్యర్థి గెలుపు అంత సులభతరం కాదని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తంపై సీఎం సొంత జిల్లా అయినా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎమ్మెల్సీ, ఎంపీ స్థానాలను దక్కించుకోవాలంటే ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు కార్యకర్తలు చెమటోడ్చక తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.