గవర్నర్ తమిళి సై ఆ బిల్లు ఆమోదించకపోతే ఉద్యమమే: బాల్క సుమన్
ఉభయ సభల్లో ఆమోదించిన బిల్లులను గవర్నర్ పెండింగ్‌లో పెట్టడం దుర్మార్గం అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ఉభయ సభల్లో ఆమోదించిన బిల్లులను గవర్నర్ పెండింగ్‌లో పెట్టడం దుర్మార్గం అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. యూనివర్సిటీలో నియామకాలు కామన్ రిక్రూట్ బోర్డు ద్వారా చేయాలని ప్రభుత్వం బిల్లును తెచ్చిందని, ఆ బిల్లును గవర్నర్ తమిళిసై పెండింగ్‌లో పెట్టడం అన్యాయమన్నారు. ఆమె తీరు బాధాకరం అన్నారు. ఉద్దేశపూర్వకంగానే యూనివర్సిటీ రిక్రూట్ మెంట్ బిల్లును గవర్నర్ ఆపారని మండిపడ్డారు.
విద్యా శాఖ మంత్రి, అధికారులు గవర్నర్‌ను కలిసి బిల్లు గురించి వివరించారని, అయినా ఉలుకుపలుకు లేకుండా నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు చల్లేలా వ్యవహరిస్తున్నారన్నారు. వెంటనే గవర్నర్ బిల్లును ఆమోదించాలని, యూనివర్సిటీల్లో బోధన, బోధనేతర సిబ్బందిని భర్తీ చేసేలా సహకరించాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆలస్యం చేస్తే యూనివర్సిటీల్లోని యువత ఆగ్రహానికి గురవుతారని స్పష్టం చేశారు. కేంద్రంలో వివిధ శాఖల్లో 9 లక్షల 77 వేల ఖాళీలు ఉన్నాయని పార్లమెంట్‌లో ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పిందన్నారు. కేంద్రం ఉద్యోగాలు భర్తీ చేయదు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని చేయనీయదని ఆవేదన వ్యక్తం చేశారు.
టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. పరిస్థితి చేయి దాటక ముందే గవర్నర్ బిల్లును ఆమోదించాలని కోరారు. యూనివర్సిటీల్లో చదువుతున్న వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉందన్నారు. వేరే రాష్ట్రాల్లో అమలులో ఉన్న కామన్ రిక్రూట్ మెంట్ తెలంగాణలో తెస్తే తప్పేందని ప్రశ్నించారు. ఢిల్లీ బీజేపీ నేతలు ఏం చెబితే గవర్నర్ అదే అమలు చేస్తున్నారని ఆరోపించారు.
యూనివర్సిటీల్లో ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారికే ఉద్యోగాలు ఇచ్చుకున్నారని మండిపడ్డారు. యూనివర్సిటీ కామన్ రిక్రూట్ మెంట్ తెస్తే ఎస్సీ, ఎస్టీలకు అవకాశం వస్తే తమ ప్రాబల్యం తగ్గుతుందని బీజేపీ కుట్ర చేసిందన్నారు. గవర్నర్ బిల్లు ఆమోదించక పోతే విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారని హెచ్చరించారు. మాజీ మేయర్ బొంతు రాంమ్మోహన్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. సమావేశంలో కార్పొరేషన్ చైర్మన్లు క్రిశాంక్, వాసుదేవరెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ పాల్గొన్నారు.