మూసీ ప్రక్షాళన రేపటి నుంచే..హైడ్రాకు ఆక్రమణల తొలగింపు బాధ్యతలు

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫ్లాగ్ షిప్ కార్యక్రమాల్లో ఒకటైన మూసీ నది ప్రక్షాళన పనులు రేపటి నుంచే షురూ కానున్నాయి.

Update: 2024-09-21 09:02 GMT

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫ్లాగ్ షిప్ కార్యక్రమాల్లో ఒకటైన మూసీ నది ప్రక్షాళన పనులు రేపటి నుంచే షురూ కానున్నాయి. శనివారం మలక్​పేట నియోజకవర్గంలోని పిల్లి గుడిసెలలోని డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ మూసీ సుందరీకరణపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని ఆయన తెలిపారు. ఆదివారం నుంచి మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఆక్రమణలను తొలగించనున్నట్లుగా వెల్లడించారు. మూసీ ప్రాంతాన్ని పర్యాటక , పారిశ్రామిక, ఉపాధి అవకాశాలు పెంచే విధంగా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. మూసీ పరివాహక ప్రజలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు. మూసీ ప్రక్షాళన, పునః నిర్మాణాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. 55కిలో మీటర్ల మేరకు మూసీ అభివృద్ధి పనులు సాగుతాయన్నారు. కాగా మూసీ నది పరివాహకంలోని ఆక్రమణల తొలగింపు బాధ్యతలను హైడ్రాకు అప్పగించారు. మొదటి విడతగా నది గర్భంలోని ఆక్రమణలను తొలగించనున్నారు. సుమారు 12 వేల ఆక్రమణలున్నట్లు ఇప్పటిదాకా అధికారికంగా గుర్తించారు.


Similar News