Body Building : సిక్స్ ప్యాక్ కోసం స్టెరాయిడ్స్! నగరంలో భారీగా స్టెరాయిడ్స్ పట్టివేత
జిమ్‌లో కొంత మంది యువత చక్కటి దేహదారుఢ్యం, సిక్స్ ప్యాక్ కోసం కసరత్తు చేస్తుంటారు. శరీరాకృతి తొందరగా రావాలంటే స్టెరాయిడ్లు వాడాలని నమ్మించి కొన్ని ముఠాలు వారిని లక్ష్యంగా చేసుకోని స్టెరాయిడ్లను విక్రయిస్తున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: జిమ్‌లో కొంత మంది యువత చక్కటి దేహదారుఢ్యం, సిక్స్ ప్యాక్ కోసం కసరత్తు చేస్తుంటారు. శరీరాకృతి తొందరగా రావాలంటే స్టెరాయిడ్లు వాడాలని నమ్మించి కొన్ని ముఠాలు వారిని లక్ష్యంగా చేసుకోని స్టెరాయిడ్లను విక్రయిస్తున్నారు. గంటల తరబడి జిమ్ముల్లో చెమటోడ్చి వ్యాయమం చేసే బదులు, స్టెరాయిడ్లు వాడితే సులభంగా మంచి ఆకృతిని సొంతం చేసుకోవచ్చని చెబుతుంటారు. ఇలా అక్రమంగా జిమ్ సెంటర్లకు స్టెరాయిడ్స్‌ను విక్రయిస్తున్న మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ సొసైటీ అధికారులు తాజాగా దాడులు నిర్వహించారు. కోఠి ఇసామియా బజార్‌లో రాకేశ్ డిస్ట్రిబ్యూటర్ పేరుతో నడుస్తున్న షాపులో దాదాపు రూ.2 లక్షల ఆండ్రోజెన్, అనాబాలిక్ వంటి 22 రకాల స్టెరాయిడ్లను గుర్తించారు.
బాడీ బిల్టింగ్, జిమ్‌కు వెళ్లే వారి కోసం ప్రత్యేకంగా స్టెరాయిడ్స్ విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 18,19 తేదీల్లో సోదాలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే నిర్వాహకుడు రాకేశ్ కనోడియాపై కేసు నమోదు చేసినట్లు డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్స్ తెలిపారు. అదేవిధంగా మియాపూర్‌లోని శ్రీకాంత్ న్యూరో సెంటర్‌లో దాదాపు రూ.1.01 లక్షల విలువైన స్టెరాయిడ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసి మందుల దుకాణాన్ని సీజ్ చేశారు. స్టెరాయిడ్స్ వల్ల కాలేయ వ్యాధులతో పాటు గుండె సంబంధిత సమస్యలు వచ్చి ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.