‘ఎన్నికల లబ్ధి కోసం మోడీ మతాన్ని రెచ్చగొడుతున్నడు’

ప్రధానమంత్రి మోడీ ఎన్నికల లబ్ధి కోసం మతాన్ని రెచ్చగొడుతున్నాడని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీరయ్య అన్నారు.

Update: 2023-03-25 06:55 GMT

దిశ,బెల్లంపల్లి: ప్రధానమంత్రి మోడీ ఎన్నికల లబ్ధి కోసం మతాన్ని రెచ్చగొడుతున్నాడని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీరయ్య అన్నారు. శనివారం సిపిఎం జనచైతన్య యాత్ర బెల్లంపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా కాంట చౌరస్తా వద్ద ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ విధానాలకు అనుకూలంగా మారిపోయిందని విమర్శించారు. దేశ సంపదను అంబానీ ఆదానీలకు మోడీ అమ్మి వేస్తున్నాడని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించిన వారిని దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నారని తెలిపారు.

ప్రశ్నించే గొంతులను అణచివేస్తూ ప్రధానమంత్రి మోడీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడని ధ్వజమెత్తాడు. రాజ్యాంగ విలువలను ధ్వంసం చేస్తూ ఆర్ఎస్ఎస్ మత మూకలతో దేశంలో మతోన్మాదాన్ని సృష్టిస్తున్నాడని విమర్శించారు. ప్రతిపక్షాల మధ్య వైరుధ్యాలను సృష్టించి ఐక్య ఉద్యమాలను విచ్ఛిన్నం చేసేందుకు మతాన్ని ప్రధాన అస్త్రంగా ప్రయోగిస్తున్నాడని విమర్శించారు. మనువాదాన్ని దేశం‌పై రుద్దడానికి ప్రధానమంత్రి మోడీ ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో కుట్రలు చేస్తున్నాడని విమర్శించారు. ఆదివాసీలపై ప్రజాస్వామ్యవాదులపై దాడులు చేస్తున్నాడని విమర్శించారు.

చరిత్రాకమైన సింగరేణి సంస్థను కార్పొరేట్ శక్తులకు అమ్మివేస్తున్నాడని విమర్శించారు. సీఎం‌పిఎఫ్ ఫండ్‌ను ప్రవేటు కంపెనీలో ఇన్వెస్ట్ చేసి రూ.226 కోట్లు మింగాడని విమర్శించారు. దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేత అయిన రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసి ప్రశ్నించే వారిని జైల్లో బంధిస్తున్నాడని ఫైర్ అయ్యారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటి చర్య అన్నారు. ప్రజలను దేశ సంపదను దోచుకుంటున్న కార్పొరేట్ శక్తుల నుంచి కాపాడుకునేందుకు సిపిఎం జనచైతన్య యాత్ర చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి సంకే రవి, సీనియర్ నాయకుడు ఎస్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News