Manda Krishna: ఎమ్మెల్యేలు వీధిరౌడీలను మించిపోయారు! ఎమ్మార్పీఎస్ చీఫ్ మందకృష్ణ ఫైర్

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య వివాదంపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ స్పందించారు.

Update: 2024-09-12 12:47 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య వివాదంపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ స్పందించారు. ఎమ్మెల్యేలు వీధి రౌడీల్లా రొడ్డెక్కడం హేయమైన చర్య అని గురువారం ఒక వీడియో విడుదల చేశారు. కౌశిక్ రెడ్డి, అరికెపూడి శాసనసభ సభ్యత్వాలను స్పీకర్ రద్దు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండాలంటే ఇటువంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని మందకృష్ణ మాదిగ అన్నారు. పరస్పర దాడులు చేసుకుంటూ రౌడీలకు వీరు ఆదర్శంగా నిలుస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేల ప్రవర్తన, మాటలు, చేష్టలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. వారు చేసిన వ్యాఖ్యలు స్త్రీలను కించపరిచే విధంగా ఉన్నాయని చెప్పారు.

ఇద్దరి ప్రవర్తన వీధిరౌడీలను మించిపోయేలా ఉందన్నారు. ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఎమ్మెల్యేలకు ఏమీ కాదని, మధ్యలో కార్యకర్తలు బలయ్యే ప్రమాదం ఉందన్నారు. అసలు వీళ్లు వ్యక్తిగత దూషణలతో ప్రజలకు ఏం చెప్పాలను కున్నారని మంద కృష్ణ నిలదీశారు. కాగా, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవాళ్లు, ప్రతిసవాళ్లతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది.

కౌశిక్ ఓ బ్రోకర్ అని.. దమ్ముంటే బయటికి రా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ సవాల్ చేశారు అరికెపూడి గాంధీ. ఈ నేపథ్యంలోనే కౌశిక్ ఇంటిపై కార్యకర్తలు, అనుచరులు టమోటాలు, గుడ్లతో దాడి చేశారు. దీంతో గాంధీతో పాటు పలువురు అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తనను హత్య చేయడానికి ఇంటికి వచ్చారని, రేపు (శుక్రవారం) ఉదయం బీఆర్ఎస్ పార్టీ తడాఖా చూపిస్తామని పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. దీంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.


Similar News