MLC Kavitha: ఒక్కరిని కూడా వదలను.. వడ్డీతో సహా చెల్లిస్తా

ఢిల్లీ లిక్కర్ కేసులో ఐదున్నర నెలల పాటు (మార్చి 15 నుంచి) తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం రాత్రి 9.15 గంటలకు విడుదలయ్యారు.

Update: 2024-08-27 16:29 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ కేసులో ఐదున్నర నెలల పాటు (మార్చి 15 నుంచి) తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం రాత్రి 9.15 గంటలకు విడుదలయ్యారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రౌస్ ఎవెన్యూ కోర్టు రిలీజ్ వారెంట్‌తో ఫార్మాలిటీస్ పూర్తయిన అనంతరం తీహార్ జైలు నుంచి విడుదలైన కవిత భావోద్వేగానికి గురై కంట తడి పెట్టారు. ఆమెను రిసీవ్ చేసుకోడానికి భర్త అనిల్‌, కుమారుడు, సోదరుడు కేటీఆర్, బంధువు హరీశ్‌రావు, పలువురు బీఆర్ఎస్ నేతలు జైలు దగ్గరకు వెళ్ళారు. గేటు దాటి బైటకు రాగానే కుమారుడిని పట్టుకుని ఏడ్చిన కవిత కొద్దిసేపు నోట మాటరాకుండా ఉండిపోయారు. జైలు నుంచి వస్తున్న కవితకు స్వాగతం పలకడానికి బీఆర్ఎస్ శ్రేణులు భారీ స్థాయిలో అక్కడికి చేరుకున్నారు. అనంతరం కార్యకర్తలను, ప్రజలను ఉద్దేశించి మైక్ ద్వారా మీడియా ద్వారా భావోద్వేగంతో ఆమె మాట్లాడిన మాటలు...

“మీ అందరినీ కలవడం సంతోషం.. ఇక్కడకు వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలకు హృదయపూర్వక నమస్కారాలు. నేను 18 సంవత్సరాలుగా నేను పాలిటిక్స్ లో ఉన్నాను... ఎన్నో ఎత్తుపల్లాలను చూశాను... పిల్లలను వదిలి ఐదున్నర నెలలు జైల్లో ఉండడం కష్ట సమయం... నాకైనా, నా కుటుంబానికైనా ఐదున్నర నెలలు జైలు లోపల ఉండడం ఇబ్బందికరమే... నేను ఇప్పుడు ఎవరి గురించీ చెప్పాల్సిన పనిలేదు... నేను కేసీఆర్ బిడ్డను... తప్పు చేసే ప్రసక్తే లేదు... నన్ను ఇబ్బందులకు గురిచేసినవారిని వదిలి పెట్టను... కచ్చితంగా వడ్డీతో సహా చెల్లిస్తాం... నాకు పోరాటం కొత్త కాదు... ఇంకా నాకు తెగింపు ఉన్నది... అంతే ధైర్యంతో ప్రజా క్షేత్రంలో నిలబడతా... రాజకీయంగా తేల్చుకుంటా... బీఆర్ఎస్ పార్టీకి, నా కుటుంబానికి ఇబ్బందులు సృష్టించారు... వడ్డీతో సహా చెల్లిస్తాం... కష్టకాలంలో అండగా నిలిచినవారందరికీ ధన్యవాదాలు... వారందరికీ పాదాభివందనం...” అని వ్యాఖ్యానించారు.

రాజకీయ కారణాలతో నన్ను జైల్లో పెట్టిన శక్తులకు వ్యతిరేకంగా కొట్లాడుతానని, ఆ కుట్రలను బట్టబయలు చేస్తానని కవిత హెచ్చరించారు. సహజంగానే తాను మొండిదాన్నని, రాజకీయ ప్రేరేపితంగా తనను ఈ కేసులో ఇరికించి జగమొండిగా తయారుచేశారని అన్నారు. ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తానని, అందరితో కలిసి నిలబడుతానని, చట్టపరంగా, రాజకీయంగా కొట్లాడుతానని స్పష్టం చేశారు. ఇల్లీగల్‌గానే ఇంతకాలం తనను జైల్లో పెట్టారని అన్నారు. అనంతరం ఆమె ఢిల్లీలోని బీఆర్ఎస్ ఆఫీసుకు వెళ్ళారు.





 


 



Similar News