సుప్రీంకోర్టుకు కవిత.. వచ్చే వారం బెయిల్ రావొచ్చన్న కేటీఆర్
ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టులో గతంలో బెయిల్ రిజెక్టు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను తాజా పిటిషన్‌లో ఆమె సవాలు చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టులో గతంలో బెయిల్ రిజెక్టు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను తాజా పిటిషన్‌లో ఆమె సవాలు చేశారు. సీబీఐ, ఈడీ దాఖలు చేసిన అభియోగాలు, వాటికి అనుగుణంగా ట్రయల్ (రౌస్ ఎవెన్యూ) కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లు, వాటిని స్పెషల్ జడ్జి పరిగణనలోకి తీసుకోవడం... వీటన్నింటి నేపథ్యంలో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో దాదాపు ఏడాదిన్నర పాటు తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేయడంతో కవిత కూడా ఇప్పుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాధన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చేలా లిస్ట్ అయింది. దాదాపు ఐదు నెలలుగా ఆమె ఢిల్లీ లిక్కర్ కేసులో తీహార్ జైల్లో ఉన్నారు.
సీబీఐ సమర్పించిన చార్జిషీట్ లోపభూయిష్టంగా ఉన్నదని రౌస్ ఎవెన్యూ కోర్టులో ఆమె తరఫు లాయర్లు వాదించి డిఫెక్టు చార్జిషీట్‌కు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోరారు. కానీ సీబీఐ తరఫున వాదలను విన్న తర్వాత చార్జిషీట్‌లో లోపాలు లేవని నిర్ధారణకు వచ్చిన కవిత తరఫు న్యాయవాది... డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఐదు నెలలుగా తీహార్ జైల్లో ఉన్న ఆమెను భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, బంధువు హరీశ్‌రావు ములాఖత్ ద్వారా కలిసి మాట్లాడారు. ఈ ఐదు నెలల కాలంలో ఆమె అనారోగ్య సమస్యలకు గురికావడంతో దీనదయాళ్, ఎయిమ్స్ ఆసత్రుల్లో అడ్మిట్ చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వడానికి (జూలై 1న) నిరాకరించడంతో పలు అంశాలను ప్రస్తావిస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారించిన తర్వాత బెయిల్‌పై రానున్న రోజుల్లో ఎలాంటి ఉత్తర్వులు వెలువరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
వచ్చే వారం బెయిల్ రావొచ్చు : కేటీఆర్
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయ్యి తీహార్ జైల్లో ఉన్న కవిత అనేక ఇబ్బందులు పడుతున్నదని, అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయని, ఐదు నెలల వ్యవధిలో 11 కిలోల బరువు తగ్గారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీపీ (బ్లడ్ ప్రెషర్) సమస్యలను ఎదుర్కొంటున్నారని, ప్రతీ రోజు రెండు టాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తున్నదని మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు. తీహార్ జైల్లో పరిశుభ్రత అధ్వాన్నంగా ఉన్నదని, పరిమితికి మించి ఖైదీలు ఉన్నారని వివరించారు. ఆ జైల్లో 11 వేల మంది ఖైదీలు ఉండాల్సిన చోట దాదాపు 30 వేల మంది ఉన్నారని, అందువల్లనే పారిశుద్యం లోపించిందని, అనారోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు.
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు బెయిల్ అంశంపై ఆలోచించి మాట్లాడాలని అంటూనే... ఆయనకు బెయిల్ మంజూరైనందున కవితతో సహా మిగిలినవారికీ వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వచ్చే వారమే కవితకు బెయిల్ రావొచ్చని, న్యాయ నిపుణులతో, సీనియర్ లాయర్లతో సంప్రదింపులు జరిపిన అనంతరం గురువారమే సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశామని, ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేశామన్నారు. పొలిటికల్‌గా కోట్లాడాల్సి వచ్చినప్పుడు ఇలాంటివి తప్పవన్నారు. జైలుకు వెళ్లి వచ్చిన వారు భవిష్యత్తులో పెద్ద లీడర్లు అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.