Balmuri Venkat : సిగ్గు లేకపోతే సరి! హరీశ్‌రావుకు బల్మూరి వెంకట్ షాకింగ్ కౌంటర్

కాంగ్రెస్ పాలనలో గురుకులాల నిర్వహణ అద్వాన్న స్థితికి చేరుకుందనడానికి ఇది మరొక నిదర్శనమని ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీశ్‌రావు విమర్శించారు.

Update: 2024-10-15 10:55 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వం పది నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో యజమాని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్‌కు తాళం వేసిన దుస్థితి వచ్చందని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పాలనలో గురుకులాల నిర్వహణ అద్వాన్న స్థితికి చేరుకుందనడానికి ఇది మరొక నిదర్శనమని ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీశ్‌రావు విమర్శించారు. ఈ పోస్ట్‌పై ఎక్స్ వేదికగా కోట్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ షాకింగ్ కౌంటర్ ఇచ్చారు. గత పదేళ్ళ మీ బీఆర్ఎస్ పాలనలో గురుకులాలకు ఒరగబెట్టింది ఏంటని ప్రశ్నించారు. మీ హయాంలో నిధులు లేక గురుకులాలు తల్లడిల్లలేదా అని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు కట్టుకోడానికి ఉన్న నిధులు, విద్యాదానం చేసే గురుకుల భవనాలు కట్టడానికి కానరలేదా అని ప్రశ్నించారు.

మీ పనికిమాలిన ప్రభుత్వంలో 5 వేల పాఠశాలలు మూతపడడం వాస్తవం కాదా అని తీవ్ర ఆరోపణలు చేశారు. విద్యార్ధుల మెరుగైన భవిష్యత్తు కోసం కనీస మౌలిక సదుపాయాలు అందించడం చేతకాని మీరూ.. ఇప్పుడు కుయ్యో మొర్రో అంటున్నారు.. సిగ్గు లేకపోతే సరి.. అని తీవ్ర విమర్శలు చేశారు. మీరూ గాలికి వదిలేసిన గురుకుల వ్యవస్థను గాడిలో పెట్టేందుకే ఒక శాశ్వత పరిష్కారం సీఎం రేవంత్ రెడ్డి & డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చొరవ తీసుకుని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మించబోతున్నారని తెలిపారు. ఈ పాఠశాలలు మారుతున్న కాలానికి తగ్గట్టు, కావాల్సిన నైపుణ్యాలను విద్యార్థులకు అందిస్తూ.. వారు ప్రపంచంతో పోటీ పడేలా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపొందించబడుతున్నాయని వెల్లడించారు.


Similar News