బీఆర్ఎస్ పేరు మార్పు కార్యకర్తలకు ఇష్టం లేదు: CM కేసీఆర్‌కు మైనంపల్లి సంచలన లేఖ

బీఆర్ఎస్ మాజీ నేత, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. బీఆర్ఎస్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు తనకు ఇబ్బందిగా మారాయని పేర్కొన్నారు.

Update: 2023-09-23 05:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ మాజీ నేత, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. బీఆర్ఎస్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు తనకు ఇబ్బందిగా మారాయని పేర్కొన్నారు. పార్టీలోని కొందరు సీనియర్ నేతలకు తనకు తీవ్ర విభేదాలు ఉన్నాయని తెలిపారు. బీఆర్ఎస్‌లో పారదర్శకత, ప్రజాస్వామ్యం లేదన్నారు. పార్టీ అగ్రనాయకత్వం క్షేత్ర స్థాయిలో ఉన్న.. శ్రేణుల అభిప్రాయాలను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.

అగ్రనాయకత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపించారు. బీఆర్ఎస్ పేరు మార్చడం పార్టీ కార్యకర్తలకు ఇష్టం లేదన్నారు. ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ చేయడం తెలంగాణలో నష్టమని మైనంపల్లి అభిప్రాయం వ్యక్తం చేశారు. అధికారం కోసం ఆరాట పడే కొందరి చేతుల్లోకి బీఆర్ఎస్ వెళ్లిందని కీలక వ్యాఖ్యలు చేశారు. మల్కాజిగిరిలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేశానని.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీని గెలిపించానని రాసుకొచ్చారు.

కాగా, తనతో పాటు తన కొడుక్కి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కావాలని మైనంపల్లి ఆశించాడు. మెదక్ అసెంబ్లీ స్థానం నుండి తన కొడుకు మైనంపల్లి రోహిత్‌ను బరిలోకి దింపాలని చూశాడు. కానీ బీఆర్ఎస్ అధిష్టానం మైనంపల్లికి మల్కాజిగిరి టికెట్ ఇచ్చినప్పటికీ.. ఆయన కొడుక్కి టికెట్ నిరాకరించింది. దీంతో మైనంపల్లి బీఆర్ఎస్ పార్టీపై తిరుగుబావుటా ఎగరేశారు. బీఆర్ఎస్ అగ్రనేత, మంత్రి హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుక్కి టికెట్ రాకుండా అడ్డుకుంది మంత్రి హరీష్ రావే అని బహిరంగంగా విమర్శలు చేశారు.

అయినప్పటికీ బీఆర్ఎస్ హైకమాండ్ మైనంపల్లి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక, బీఆర్ఎస్‌పై తిరుగుబావుటా ఎగరేసిన మైనంపల్లి త్వరలోనే కాంగ్రెస్‌లో చేరుతారని జోరుగా ప్రచారం జరుతుంది. ఈ క్రమంలోనే మైనంపల్లి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేసిన ఎమ్మెల్యే.. తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. 

Tags:    

Similar News