సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరో లేఖ
ఫీజు రీ ఎంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంగళవారం లేఖ రాశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ఫీజు రీ ఎంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంగళవారం లేఖ రాశారు. ఇప్పటి వరకు సుమారు రూ.5 వేల కోట్ల బకాయిలు ఉన్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధులంతా ఆందోళనలో ఉన్నారని, వెంటనే ఆదుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకువచ్చిన ఈ స్కీమ్‌ను నిర్వీర్యం చేయడం సరికాదన్నారు. ఈ పథకం ద్వారా ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. కానీ ఫీజు రీ ఎంబర్స్మెంట్ నిధులు సమయానికి విడుదల చేయకపోవడం వల్ల అటు కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తు చేశారు.
ఇప్పటికే కొన్ని కాలేజీలు మూతపడ్డాయన్నారు. మరి కొన్ని కాలేజీలు లెక్కరర్‌లకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితిలో లేవన్నారు. ఫీజులు రీ ఎంబర్స్మెంట్ కాకపోవడంతో ఆయా కాలేజీలు విద్యార్ధులకు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదని, దీని వలన ఉన్న చదువులు చదివేందుకు విద్యార్ధులకు ఇక్కట్లు పడుతున్నారన్నారు. సర్టిఫికేట్లు లేక ఉద్యోగాలూ చేయలేకపోతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే చాలా మంది తల్లితండ్రులు అప్పులు చేసి మరీ పైసలు కట్టి సర్టిఫికెట్స్ తీసుకుంటున్నారని, అవి తిరిగి రాకపోవడంతో అంతా అస్తవ్యస్తంగా మారిపోయిందన్నారు. కావున పెండింగ్‌లోని ఫీజు రీ ఎంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని కోరారు.