Maharashtra: బీసీ బీజేపీ నేతలకు మంత్రులు పొన్నం, సీతక్క కీలక సూచన
మహారాష్ట్ర(Maharashtra)లోని చంద్రాపూర్ జిల్లాలో తెలంగాణ మంత్రులు సీతక్క(Seethakka), పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) ప్రచారం నిర్వహించారు.
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర(Maharashtra)లోని చంద్రాపూర్ జిల్లాలో తెలంగాణ మంత్రులు సీతక్క(Seethakka), పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలను ఉద్దేశించి వారు మాట్లాడారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం దేశంలో ఎవరు అడ్డుపడినా కులగణన జరిగి తీరుతుందని అన్నారు. ప్రధాని మోడీ(PM Modi), కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) అడ్డువచ్చినా ఆగదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేతృత్వంలో తెలంగాణ కులగణన ప్రారంభమైందని.. ఇది దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. ఇప్పటికే 50 శాతం సర్వే కూడా పూర్తయిందని తెలిపారు. ప్రజలే ముందుకు వచ్చి సర్వేలో తమ వివరాలు చెబుతున్నారని అన్నారు. అధికారులను ఇంటికి ఆహ్వానించి మరీ వివరాలు ఇస్తున్నారని చెప్పారు. ప్రజలంతా సహకరిస్తుంటే కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ది పొందేందుకు బీజేపీ, బీఆర్ఎస్ వాళ్లు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ఐక్యత కాంగ్రెస్ నేతలు ప్రాణ త్యాగాలు చేశారని గుర్తుచేశారు. రాజుర నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం ఖాయమని జోస్యం చెప్పారు. మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ కూటమి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ కూటమి కులగణన చేస్తుందని హామీ ఇచ్చారు. ‘సామాజిక న్యాయాన్ని కాంక్షించే బీసీ బీజేపీ నేతలు ఆ పార్టీ నుంచి బయటకు రండి.. మేమెంతో మాకు అంత నిజం చేసుకోవడానికి బీజేపీ నాయకత్వాన్ని ప్రశ్నించండి’ అని మంత్రులు పిలుపునిచ్చారు. హిందూ, ముస్లింల పేరుతో ప్రజలను చీల్చి బీజేపీ రాజకీయాలు చేస్తుందని అన్నారు.