బీఆర్ఎస్ నేతలతో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కీలక సమావేశం
తెలంగాణ భవన్‌లో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిల
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ భవన్‌లో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిల సమావేశం నిర్వహిస్తున్నారు. తొలి విడతగా 54 మందితో నియోజకవర్గ ఇన్చార్జులను బీఆర్ఎస్ ప్రకటించింది. వీరందరికీ నియోజకవర్గంలోని క్యాడర్, నాయకులను ఎలా సమన్వయం చేయాలి? ఎన్నికలకు ఎలా ముందుకు వెళ్లాలి? సంక్షేమ పథకాలను, చేసిన అభివృద్ధిని ఎలా వివరించి ప్రజలను ఆకట్టుకోవాలి? అనే అంశాలపై మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. మూడోసారి ఎన్నికలు ప్రతిష్టాత్మకం కావడంతో గెలుపే లక్ష్యంగా ఇన్చార్జిలకు మార్గనిర్దేశం చేయనున్నారు. సంక్షేమ లబ్ధిదారుల వివరాలతో గ్రామాలకు వెళ్లాలని, వారికి ప్రభుత్వ ఉద్దేశాలను వివరించాల్సిన విషయాలను చెప్పనున్నారు. కేసీఆర్‌కు ఓటు వేసి మరోసారి ఆదరించాలని వివరించనున్నారు.
అదేవిధంగా కులాల వారీగా ప్రభుత్వం చేసిన సహాయ సహకారాలు సమావేశాలు నిర్వహించి వివరించాలని ఇన్చార్జిలకు సూచించే అవకాశం ఉంది. గత పది ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకెళ్లాలని.. మళ్లీ అధికారంలోకి వస్తే పెద్దపీట వేస్తారని వివరించాలని ఇన్చార్జిలను ఆదేశించే అవకాశం ఉందని సమాచారం. ఏది ఏమైనా నియోజకవర్గ ఇన్చార్జిలతో మంత్రుల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.