కేటీఆర్ కుమారుడితో సెల్ఫీ కోసం ఎగబడుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు!

టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారిపోయింది. జాతీయ రాజకీయ లక్ష్యాలతో ఆ పార్టీ మొదటి అడుగు పడింది.

Update: 2022-12-15 11:12 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారిపోయింది. జాతీయ రాజకీయ లక్ష్యాలతో ఆ పార్టీ మొదటి అడుగు పడింది. బుధవారం ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీకి జాతీయ కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ కీలక ఘట్టానికి మంత్రి కేటీఆర్ హాజరుకాకపోవడం చర్చనీయాశంగా మారింది. అయితే కేటీఆర్ హాజరు కానప్పటికీ టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఛైర్మన్లు ఓ యువకుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. అతడే కేటీఆర్ కుమారుడు హిమాన్షు. హిమాన్షు అంటే తన తాత కేసీఆర్‌కు ఎంత ప్రేమే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో అనేక కార్యక్రమాల్లో హిమాన్షును తన పక్కనే ఉండేలా కేసీఆర్ చూసుకుంటూ వచ్చారు. వయసులో చిన్నవాడైనప్పటికీ రాజకీయ వ్యవహారాల్లో తలదూర్చుతున్నాడని హిమాన్షును ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తూనే వస్తున్నాయి. అయినా కేసీఆర్ మాత్రం తన మనవడికి ఫ్రీ హ్యాండ్ ఇస్తాడనే టాక్ ఉంది.

మనవడి ఆశీసులు ఉంటే పదవులు సేఫా?:

బుధవారం ఢిల్లీలో జరిగిన బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవంలో హిమాన్షు సెల్ఫీ ఐకాన్‌గా మారిపోయారు. అతడితో ఫోటోలు, సెల్పీలు దిగేందుకు బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు నేతలు పోటీ పడటం హాట్ టాపిక్‌గా మారింది. హిమాన్షుతో సెల్పీ తీసుకున్న ఫోటోను ఎమ్మెల్యే కేపీ వివేకానంద ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇందులో మంత్రి మల్లారెడ్డి కూడా ఉన్నారు. ఈ పోస్టుకు క్యాప్షన్ రాస్తూ ఎనర్జిటిక్, ఫ్రెండ్లీ హిమాన్షు అంటూ ఆకాశానికెత్తాడు. ఇదే కార్యక్రమం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్స్ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ అనిల్ కూర్మాచలం కూడా హిమాన్షన్‌తో ఫోటో తీసుకుని ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఈ ప్రోగ్రామ్‌కు కేటీఆర్ దూరంగా ఉనప్పటికీ ఈ కార్యక్రమానికి హిమాన్షు రావడం ఆయనతో ఫోటోలు తీయించుకోవడానికి పార్టీ నేతలు ఆసక్తి చూపడం పట్ల నెటిజన్లు భిన్న రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. కేసీఆర్ కు హిమాన్షు అంటే ప్రేమ కావడంతో అతడిని ప్రసన్నం చేసుకుంటే తమ పదవులు సేఫ్ అని, పార్టీలో తమకు గుర్తింపు ఖాయం అనే కొంత మంది నేతలు తమ పదువులు, వయసు భేదాలు పక్కన పెట్టి ఇలా హిమాన్షు చుట్టూ తిరుగుతున్నారని అంటున్నారు. తాత, తండ్రి తర్వాత మనువడి చుట్టూ తిరుగుతారా ఇదేం విపరీతం అంటూ మరి కొంత మంది ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.

రాజకీయాల్లోకి రానంటూనే రాజకీయ కార్యక్రమాల్లో హిమాన్షు:

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిమాన్షు వార్తల్లో హైలెట్ అవుతూనే ఉన్నారు. గతంలో ఓ సారి తన స్నేహితులతో కలిసి ఏకంగా సచివాలంలో ప్రత్యక్షం అయిన హిమాన్షు.. మరో సందర్భంగా ప్రభుత్వం అధికారికంగా భద్రాద్రి రాములోరికి సమర్పించాల్సిన తలంబ్రాలను హిమాన్షు చేత ఇప్పించడం, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. స్కూల్ కు వెళ్లాల్సిన పిల్లాడు ప్రభుత్వ వ్యవహారాల్లో తలదూర్చడం ఏంటని రేవంత్ రెడ్డి లాంటి నాయకులు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. దీంతో హిమాన్షు రాజకీయ ప్రవేశంపై నిరంతరం చర్చ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో వస్తున్న ఆరోపణలకు చెక్ పెడుతూ తన రాజకీయ భవిష్యత్ పై క్లారిటీ ఇచ్చాడు. తాను భవిష్యత్ లో ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశాడు. తనకుంటూ ప్రత్యేక లక్ష్యాలు ఉన్నాయని వాటిని చేరుకోవడమే తన ధేయం అంటూ ట్వీట్ చేశాడు. రాజకీయాల్లోకి రానని చెప్పిన హిమాన్షు తాజాగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో కనిపించడంపై ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు. పార్టీలో హిమాన్షు విషయంలో క్రమంగా హైప్ క్రియేట్ చేస్తున్నారని తండ్రి హాజరు కాని కార్యక్రమంలో హిమాన్షు పాల్గొంటే అతడితో సెల్ఫీలు, ఫోటోలు దిగి ఆకాశానికెత్తుతూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.


Similar News