Minister Thummala: భూమి ఓనర్, కౌలురైతులే తేల్చుకోవాలి

పంట వేసే రైతులకే రైతుభరోసా రూపంలో ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని, అలా ఇవ్వడమే న్యాయమంటూ రైతులంతా చెప్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Update: 2024-09-19 16:44 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పంట వేసే రైతులకే రైతుభరోసా రూపంలో ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని, అలా ఇవ్వడమే న్యాయమంటూ రైతులంతా చెప్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతు భరోసా సాయం పంపిణీపై కేబినెట్ సబ్ కమిటీ ఇటీవల రాష్ట్రమంతా పర్యటించి రైతుల అభిప్రాయాలను సేకరించింది. ఈ అంశాలను మంత్రి తుమ్మల ఢిల్లీలో మీడియా సమావేశంలో వెల్లడిస్తూ... 200 శాతం మంది రైతాంగం పంట వేసే రైతులకే రైతుభరోసాను ఇవ్వాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే ఆలోచనతో ఉన్నట్లు తెలిపారు. అయితే భూ యజమాని, కౌలు రైతులు పరస్పరం చర్చించుకుని ఈ విషయాన్ని తెలియజేయాలని, ఈ ఇష్యూపై స్పష్టత రానందువల్లనే ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోకుండా పక్కన పెట్టిందని, అందువల్లనే గైడ్ లైన్స్ రూపకల్పనలో ఆలస్యం జరుగుతున్నదన్నారు. త్వరలో దీనిపై స్పష్టత వస్తుందన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో భూ యజమానికి, కౌలు రైతులకు మధ్య తెల్ల కాగితంపై ఒప్పందాలు ఉంటాయని, కానీ తెలంగాణలోని భూ చట్టాలు డిఫరెంట్‌గా ఉన్నందున ఆ ఒప్పందాల విషయంలో రైతుల్లో సంశయం నెలకొన్నదన్నారు. ఏపీలో కుదిరే ఒప్పందాల ప్రకారం కౌలు రైతు కుదుర్చుకునే తెల్ల కాగితం ఒప్పందాన్ని ఎమ్మార్వో దగ్గర సర్టిఫై చేయించుకుంటే ప్రభుత్వంనుంచి డబ్బులు అందుతాయన్నారు. కానీ తెలంగాణలో ఈ విధానానికి సంక్లిష్టత ఉందన్నారు. రైతుభరోసా అమలు విషయంలో ఇలాంటి చిక్కులున్నా ఇటీవల వరదలతో పంటలు నష్టపోయిన రైతుల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన విధానాన్నే అవలంబించిందన్నారు. పంటలకు నష్టం జరిగినందున ప్రభుత్వం ఎకరానికి రూ. 10 వేల చొప్పున ఇచ్చే సాయాన్ని పంట పెట్టిన రైతులకే ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశామన్నారు. కానీ పొలానికి గండ్లు పడడం లాంటి శాశ్వత నష్టానికి మాత్రం భూ యజమానికే ఇవ్వాలని చెప్పినట్లు వివరించారు.

గత ప్రభుత్వంలో అమలైన రైతుబంధు ప్రధాన ఉద్దేశం పంట వేస్తున్న రైతులకు విత్తనాలు తదితర అవసరాలకు పెట్టుబడి సాయంగా ఉండాలన్నదనేనని, కానీ కొండలు, గుట్టలు, రాళ్ళురప్పలు తదితర భూములకు కూడా మంజూరైందన్నారు. కానీ సాగులో ఉన్న భూమికే ఇవ్వాలన్నది సహజ న్యాయమని, అప్పుడే ఆ స్కీమ్ స్ఫూర్తి నెరవేరుతుందని మంత్రి వివరించారు. రైతులకు పంట పెట్టుబడి సాయం పూర్తిస్థాయిలో ఇవ్వడం ప్రభుత్వాలకు సాధ్యమయ్యేది కాదని, అందువల్లనే ఎకరానికి రూ. 10 వేల చొప్పున గత ప్రభుత్వంలో అమలైందన్నారు. రుణమాఫీ అమలుపై మంత్రి తుమ్మల క్లారిటీ ఇస్తూ... ముఖ్యమంత్రి చెప్పినట్లుగా రెండు లక్షల వరకు పంట రుణాలున్న దాదాపు 22 లక్షల మంది రైతులకు వారి ఖాతాల్లోనే మాఫీ డబ్బు రూ. 18 వేల కోట్ల మేర జమ అయిందన్నారు. దాదాపు మూడున్నర లక్షల కుటుంబాలకు నిర్ధారణ ప్రక్రియ ప్రోగ్రెస్‌లో ఉన్నదని, అది పూర్తికాగానే వారి ఖాతాల్లో కూడా జమ అవుతుందన్నారు.

రెండు లక్షల రూపాయల కంటే ఎక్కువ పంట రుణం తీసుకున్న రైతులు సీలింగ్ (రెండు లక్షల రూపాయలు) కంటే ఎక్కువగా తీసుకున్న అప్పును బ్యాంకులకు చెల్లిస్తే ప్రభుత్వం హామీ ఇచ్చిన రెండు లక్షల రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుందన్నారు. దీనికి త్వరలోనే నిర్దిష్టమైన షెడ్యూలును విడుదల చేస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పినట్లుగా రూ. 31 వేల రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, మొత్తం 42 లక్షల మంది రైతు కుటుంబాలకు అందుతుందన్నారు. ఈ కారణాల రీత్యానే ఇప్పటివరకు రెండు లక్షల వరకు రుణం ఉన్న రైతులకు మాఫీ అయిందని, మిగిలినవారికి టెక్నికల్ ఇబ్బందులు, ఆధార్-బ్యాంకు ఖాతాల నెంబర్లు మిస్…‌మ్యాచ్ అయినందునే జమ కాలేదన్నారు.

కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టును మంజూరు చేయాల్సిందిగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని కలిసి విజ్ఞప్తి చేశానని, ఇప్పటికే సూత్రప్రాయంగా కేంద్రం ఆమోదించిన వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్‌ఎయిర్‌పోర్టుల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరినట్లు తెలిపారు. తెలంగాణలో కొత్తగా కోకోనట్ బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్ర వ్యవసాయ మంత్రిని కోరానని, ఆయిల్ పామ్ దిగుమతి మీద 28% సుంకాన్ని విధించడం ద్వారా దేశీయంగా ఆ సాగుకు ప్రోత్సాహం లభించినట్లయింది వివరించి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపానని పేర్కొన్నారు. ఆ కోవలోనే ఆయిల్ పామ్‌కు కేంద్రం కనీస మద్దతు ధర కల్పించాలని కోరానన్నారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేయాలని కోరానన్నారు. ఖమ్మం జిల్లాలో ఇటీవల వరదలతో నష్టపోయిన కుటుంబాలకు కేంద్రం నుంచి ఆర్థిక సాయంపైనా శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో చర్చించినట్లు తెలిపారు.

కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి చిరాగ్ పాశ్వాన్‌ను కలిసి, తెలంగాణలో ఎక్కువగా పండే పంటలకు అక్కడే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పాల్సిందిగా కోరానని, సానుకూలంగా స్పందించినట్లు మంత్రి తుమ్మల మీడియాకు వివరించారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ప్రపంచ ఆహార సదస్సులో పాల్గొన్న మంత్రి... లూలూ గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ, మోనిన్ ఇండియా ఎండీ జెర్మైన్ అరౌద్, బీఎల్ అగ్రో ఎండీ నవనీత్ రవికర్‌లతో పాటు పలు ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణలో లభ్యమయ్యే అవకాశాలను వివరించి, ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించడానికి రాష్ట్రానికి రావాలని వారిని ఆహ్వానించారు. భారత్ మండపంలో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌ను సందర్శించి రాష్ట్రానికి చెందిన పలు స్టాల్‌లను పరిశీలించారు. డెలాయిట్ ఇండియా నిర్వహించిన గ్రోత్ విత్ ఇంపాక్ట్ - గవర్నమెంట్ సమ్మిట్‌లో పాల్గొని లీడర్స్ టాక్ సెషన్‌లో భాగంగా ‘వికసిత్ తెలంగాణ’ అంశంపై మంత్రి తుమ్మల ప్రసంగించారు.


Similar News