నిన్న కోమటిరెడ్డి.. నేడు తుమ్మల.. ఏకంగా మంత్రులకే షాక్ ఇస్తోన్న ఉద్యోగులు..!

తెలంగాణలో పాలనపై రేవంత్ రెడ్డి సర్కార్ తనదైన మార్క్ చూపించాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని వివిధ శాఖల

Update: 2024-07-04 14:46 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో పాలనపై రేవంత్ రెడ్డి సర్కార్ తనదైన మార్క్ చూపించాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని వివిధ శాఖల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించినట్టు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మంత్రులంతా ఆయా శాఖల కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. అయితే మంత్రులు ఆకస్మికంగా తనిఖీలు చేసి ఉద్యోగులకు సర్‌ప్రైజ్ ఇవ్వాలని చూస్తే ఉద్యోగులే మంత్రులకు షాకులు ఇస్తున్నారు. ఆఫీసులకు వెళ్లిన మంత్రులకు ఖాళీ కుర్చీలే కనిపిస్తున్నాయి. అందులో ఉండాల్సిన ఉద్యోగులు మాత్రం తర్వాత తాపీగా వస్తుండటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు సమయానికి రారనే ప్రచారంతో అసలు అధికారులు సమయపాలన పాటిస్తున్నారా లేదా అనే అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టిన రాష్ట్ర మంత్రులు వరుసగా తనిఖీలు చేస్తూ వారిలో జవాబుదారీతనాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని వ్యవసాయ శాఖ కమిషనరేట్ కార్యాలయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. మంత్రిని చూసి ఉద్యోగులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. నిర్దేశిత సమయానికి కొంత మంది మాత్రమే ఉద్యోగులు హాజరవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఎంత మంది ఉద్యోగులు హాజరయ్యారంటూ అటెండెన్స్ బుక్ చూడాలంటూ సూచించారు. మీకు టైమ్ టేబుల్ ఉండదా..? లేట్‌గా వస్తే అడిగేవారు లేరా..? అని ప్రశ్నించారు.

ఉద్యోగులు సమయపాలన పాటిస్తున్నారా లేదా అసలు డ్యూటీకి హాజరవుతున్నారా..? వారి పనితీరు ఎలా ఉంది అనే దానిపై వరుస తనిఖీలు చేస్తూ ఆరా తీస్తున్నారు. ఉద్యోగులు టైమ్‌కి రాకపోయినా, పని తీరు సరిగ్గా లేకపోయినా నివేదికలు అడుగుతున్నారు. కొన్నిసార్లు అక్కడికక్కడే అధికారులపై చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు నిర్లక్ష్యం వహించే ఉద్యోగులకు భయం పుట్టేలా ఈ తనిఖీలు జరుగుతున్నాయని తెలిసింది. ఇక నుంచి తప్పకుండా అందరూ ఉద్యోగులు సమయానికి విధి నిర్వహణకు హాజరవ్వాలని ఆదేశించారు. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చించారు.

వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యోగులు, ఇతర సిబ్బంది విధులకు నిర్దేశిత సమయానికి హాజకాకపోవడంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ గోపికి మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. కాగా, బుధవారం ఆర్‌ అండ్‌ బీ సెక్షన్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆర్ అండ్ బీ విభాగంలో ఖాళీ కుర్చీలే దర్శనమివ్వడంతో షాక్ తిన్నారు. ఇక తుమ్మలకు ఇలాంటి వాతావరణం కనిపించడంతో అధికారులపై సీరియస్ అయ్యారు.


Similar News