సమీపిస్తోన్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు.. రాష్ట్ర ప్రజలకు మంత్రి శ్రీధర్ బాబు కీలక పిలుపు

గణేష్ నవరాత్రి ఉత్సవాలు సమీపిస్తోన్న నేపథ్యంలో అధికారులు, నిర్వాహకులతో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు.

Update: 2024-08-27 10:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: గణేష్ నవరాత్రి ఉత్సవాలు సమీపిస్తోన్న నేపథ్యంలో అధికారులు, నిర్వాహకులతో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్‌ మహానగరంలో గణేష్ ఉత్సవాలు చాలా గ్రాండ్‌గా నిర్వహిస్తారని తెలిపారు. నగరంలో ఇది అతి ముఖ్యమైన పండుగ అని అన్నారు. గొప్ప పండగ వాతావరణంలో మనం ఉత్సవాలు జరుపుకుందామని పిలుపునిచ్చారు. పండుగ నిర్వహించే 11 రోజుల పాటు భక్తులకు, సామాన్య ప్రజలకు ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. ముఖ్యంగా నగరంలో ట్రాఫిక్ సమస్య రాకుండా చూసుకోవాలని సూచించారు. గణపతి మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు.

అందరి సహకారంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గణపతి ఉత్సవాలు విజయవంతం చేయాలని ఆదేశించారు. గత సంవత్సరం, అంతకు ముందు సంవత్సరం జరిగిన సంఘటనలు గుర్తుపెట్టుకొని.. మళ్లీ అలాంటివి రిపీట్ కాకుండా జగ్రత్త పడాలని చెప్పారు. ముఖ్యంగా మట్టి విగ్రహాల వాడకం పెరిగేలా అవగాహన కల్పించాలని సూచించారు. చౌరస్తాల్లో, స్కూళ్లు, కాలేజీల ఎదుట మట్టి వినాయకుల ప్రత్యేకతలు తెలియజేసేలా హోర్డింగులు పెట్టాలని సూచించారు. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనంపై గత సంవత్సరం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఒక సంవత్సరం పాటు వెసులుబాటు కల్పించింది. ముఖ్యంగా మట్టి విగ్రహాలు వాడాలని కోర్టు నుండి ఆదేశాలు వచ్చాయి. కాబట్టి అందరం పరస్పర సహకరించుకుందాం. నిమజ్జనాల విషయంలో సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగానే ముందుకు వెళ్తామని చెప్పారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్ రూం ఏర్పాటు చేసి.. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని ఆదేశించారు.


Similar News