Shridhar Babu: జూన్‌లో సీఎం మార్పు అంటూ బీజేపీ ప్రచారం.. ఘాటుగా స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు
ప్రజాస్వామ్య విలువలకు బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) పార్టీలు తిలోదకాలు ఇచ్చాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Shridhar Babu) అన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ప్రజాస్వామ్య విలువలకు బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) పార్టీలు తిలోదకాలు ఇచ్చాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Shridhar Babu) అన్నారు. జూన్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి(Chief Minister) మారుతారన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడాన్ని రెండు పార్టీలు జీర్ణించుకోలేక పోతున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందా అని బీఆర్ఎస్ పార్టీ ఎదురు చూస్తోందని శ్రీధర్ బాబు(Shridhar Babu) దుయ్యబట్టారు. ఇప్పుడు బీజేపీ అదే బాట పట్టినట్లు స్పష్టం ఔతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంలో బీజేపీ(BJP) పార్టీ నాయకులు సిద్ధహస్తులని మంత్రి శ్రీధర్ బాబు(Shridhar Babu) ధ్వజమెత్తారు. ఎన్నికల్లో గెలిచి పీఠం ఎక్కడం, ఓడి బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్రను పోషించడం ప్రజాస్వామ్యబద్ద పార్టీల విధి. అది మరచిపోయిన బీజేపీ మూడో మార్గాన్ని ఎంచుకుందని విమర్శించారు. కుట్రపూరితంగా వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చి వేసిందని ఆయన గుర్తు చేశారు. కాగా, మహారాష్ట్రలో సైతం బీజేపీ అనుసరించిన మోసపూరిత వైఖరిని ఆయన ఎత్తి చూపారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మరాఠా ఓటర్లు భారతీయ జనతా పార్టీకి తగిన బుద్ధి చెప్పడం ఖాయం అన్నారు.
బీజేపీయేతర రాష్ట్రాల్లో పార్టీలను ఏమార్చి తన పబ్బం గడుపుకోవడమే ఆ పార్టీ పంథా అని మంత్రి విమర్శించారు. కానీ, తెలంగాణాలో అలాంటి పప్పులు ఉడకవని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇక్కడ పూర్తికాలం పని చేస్తుందని శ్రీధర్ బాబు వెల్లడించారు. సీఎం మారుతారన్న ప్రకటన ద్వారా బీజేపీ రాష్ట్ర ప్రజలకు ఏ సంకేతాలు ఇవ్వదలుచుకుందని ఆయన నిలదీశారు. ఆ ప్రకటన ద్వారా వెన్నుపోటు రాజకీయాలను సమర్థిస్తామన్న తమ మనోగతాన్ని ఆ పార్టీ నేతలు బైట పెట్టుకున్నారని తెలిపారు.