Minister Sridhar Babu: వచ్చే ఏడాది చివరికి సాప్ట్‌వేర్, పశు వైద్య నిపుణులకు ఉద్యోగాలు: మంత్రి శ్రీధర్‌ బాబు

వచ్చే ఏడాది చివరి నాటికి సాఫ్ట్‌వేర్, పశువైద్య నిపుణులకు ఉద్యోగాలు రానున్నాయని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

Update: 2024-09-10 14:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే ఏడాది చివరి నాటికి సాఫ్ట్‌వేర్, పశువైద్య నిపుణులకు ఉద్యోగాలు రానున్నాయని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పశు వైద్య రంగంలో ప్రపంచ దిగ్గజం జోయెటిస్ ప్రవేశంతో లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ కొత్త మైలురాయిని దాటిందని పేర్కొన్నారు. రాయదుర్గంలో మంగళవారం జోయెటిస్ గ్లోబల్ సామర్థ్య కేంద్రాన్ని(జీసీసీ) ప్రారంభించి మాట్లాడారు. పశువులు, పెంపుడు జంతువుల ఔషధాలు, పోషకాల ఉత్పత్తిలో జోయెటిస్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని, ఆ సంస్థ సామర్థ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి బిజినెస్ ఆపరేషన్స్, డేటా మేనేజ్‌మెంట్, పరిశోధన, అభివృద్ధి లాంటి కార్యకలాపాలను నిర్వహిస్తుందని తెలిపారు.

ఇటీవలే అమెరికా పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి‌తో కలిసి జోయెటిస్ యాజమాన్యంతో చర్యలు జరిపామని గుర్తుచేశారు. అతి తక్కువ సమయంలోనే సామర్థ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. జీసీసీతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వెటర్నరీ వైద్యులు, పెంపుడు జంతువుల యజమానులు, పశువులు, జీవాల పెంపకదారులకు ఔషధాల సరఫరా, ఆరోగ్య నిర్వహణపై ఎప్పటికప్పుడు సూచనలు అందించే అవకాశం ఏర్పడుతుందని పేర్కొ్న్నారు. ఈ కార్యక్రమంలో జోయెటిస్‌ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కీత్ సార్బౌగ్, జోయెటిస్ ఇండియా సామర్థ్య కేంద్రం వైస్ ప్రెసిడెంట్ అనిల్ రాఘవ్, టీజీఐఐసీ సీఈవో మధుసూదన్, తదితరులు పాల్గొన్నారు.


Similar News