Disha Special Story: ఉద్యోగం కంటే బిజినెస్ చేయడం బెటర్.. కానీ లెక్క తప్పితే..!
ఉద్యోగం ( Job) కంటే బిజినెస్ (Business) చేయడం బెటర్.. త్వరగా డబ్బులు సంపాదించాలంటే స్మాల్ బిజినెస్ (Small business)ఉత్తమం..
ఉద్యోగం ( Job) కంటే బిజినెస్ (Business) చేయడం బెటర్.. త్వరగా డబ్బులు సంపాదించాలంటే స్మాల్ బిజినెస్ (Small business)ఉత్తమం.. ఇలా ఆలోచించి త్వరగా సెటిల్ అవ్వొచ్చని యువత వ్యాపారాలపై ఆసక్తి చూపుతున్నది. బ్యాంకు లోన్లు(Bank loans), అప్పులు చేసి మరీ ఇన్వెస్ట్‌మెంట్(Investment) పెడుతున్నది. అయితే లాభాల లెక్కలు తారుమారు కావడంతో నష్టాలు చవిచూస్తున్నది. చాలామంది టీ(Tea Businesses), టిఫిన్స్ (Breakfast Business), బిర్యానీ పాయింట్(Biryani Point) ఫ్రాంచైజీ(Franchise)ల వెంట పడి.. ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టి.. అనుకున్న లాభాలు రాకపోవడంతో అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. బిజినెస్ మొదలు పెట్టాక ఖర్చులు పెరగడం.. సరైన గైడెన్స్, అనుభవం లేక నష్టపోతున్నారు. ఫ్రాంచైజీ తీసుకోవడం మంచిదా? సొంతంగా వ్యాపారం(own business) మొదలు పెడితే మంచిదా..? అయితే చేయాలనుకున్న వ్యాపారంలో అనుభవం సంపాదించడం అన్నింటికన్నా ముఖ్యం. -తాళ్లపల్లి కుమారస్వామి
ప్రస్తుతం మార్కెట్‌లో ఫ్రాంచైజీ వ్యాపారాల(Franchise businesses)పై యువత ఆసక్తి చూపుతున్నది. పట్టణాలకే పరిమితం కాకుండా చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఫ్రాంచైజీ మార్కెట్(Franchise market) బాగా విస్తరిస్తున్నది. సరైన ప్రణాళిక, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వ్యాపారాలు ప్రారంభిస్తే భారీగా లాభాలు ఆర్జించవచ్చని నిపుణులు చెబుతున్నారు. యువత ఆలోచనలకు అనుగుణంగా నైపుణ్యం సంపాదించుకోవాలని సూచిస్తున్నారు.
అప్పులు చేసి..
చదువు పూర్తయిన యువకులు, జాబ్ చేస్తున్న వాళ్లు కూడా వ్యాపారంపైనే ఆసక్తి చూపుతున్నారు. వారి ఆలోచనలకు తగ్గట్లు వ్యాపారాలను ఎంచుకుంటున్నారు. కొందరు స్వంతంగా పెట్టుబడులు పెడుతుండగా.. మరికొందరు ఫ్రాంచైజీలను సంప్రదిస్తున్నారు. ముందుగా లాభాలను మాత్రమే లెక్కలేసుకుని పెట్టుబడి ఎంతైనా ఖర్చు పెడుతున్నారు. తెలిసిన వాళ్ల దగ్గర అప్పులు చేసి, బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుంటున్నారు. అంచనా వేసినంత లాభాలు రాకపోవడంతో నెలల వ్యవధిలోనే క్లోజ్ చేసేస్తున్నారు. దీంతో అప్పులు.. ఈఎంఐలు కట్టలేక మానసికంగా కుంగిపోతున్నారు.
ఫ్రాంచైజీ కల్చర్(Franchise culture)..
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఫ్రాంచైజీ స్టాళ్లే దర్శనం ఇస్తున్నాయి. నగరాలు, పట్టణాలు, మెయిన్ రోడ్ల వెంట ఎక్కడ చూసినా టీ, టిఫిన్, బిర్యానీ ఫ్రాంచైజీ స్టాళ్లే కనిపిస్తున్నాయి. దీంతో యువత ఫ్రాంచైజీ తీసుకుంటేనే బెటర్ అని నిర్వాహకులను సంప్రదిస్తున్నారు. వాళ్లు అడిగినంత అమౌంట్ చెల్లిస్తే మిషనరీ, మెటీరియల్, ఫర్నీచర్ సెట్ చేసి వెళ్తారు. కొద్ది రోజుల పాటు ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. అయితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పడంతో ఫ్రాంచైజీ కోసం యువకులు ఒకేసారి రూ. లక్షల్లో డబ్బులు చెల్లిస్తున్నారు. సరైన ప్రాంతాన్ని ఎంచుకోకపోవడం.. కస్టమర్లను ఆకర్షించే విధానాలు అమలు చేయకపోవడంతో నష్టాలు చవిచూస్తున్నారు.
ఫ్రాంచైజీ లేకుండా..
టీ, టిఫిన్, బిర్యానీ పాయింట్ పెట్టాలంటే ఒక్కో ఫ్రాంచైజీకి రూ. 2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు చెల్లించాల్సిందే.. పైగా వాళ్లు ఇచ్చే మెటీరియల్ మాత్రమే వాడాలి. అయితే ఫ్రాంచైజీ లేకుండా సొంతంగా వ్యాపారం మొదలు పెడితే పెట్టుబడి ఖర్చు సగం తగ్గుతుంది. ఉదాహరణకు టీ షాప్ పెడితే కాఫీ, టీ పౌడర్ ధర ఫ్రాంచైజీలో ఎక్కువకు విక్రయిస్తుండగా మార్కెట్‌లో తక్కువ ధరకే లభ్యం అవుతున్నది.
ఫ్రాంచైజీ అంటే..
ఫ్రాంఛైజింగ్ అంటే ఒక కంపెనీ(Company) పేరును ఉపయోగించడం. సదరు కంపెనీ సూచించిన ఉత్పత్తుల(Company products)ను విక్రయించడం లేదా తయారు చేయడం. బ్రాండ్ పేరు అంటే నాణ్యత మరియు వినియోగదారుల నమ్మకం.
ప్రారంభంలోనే క్లోజ్..!
అన్ని ప్రారంభ వ్యాపారాల్లో కార్యకలాపాలు ప్రారంభించిన మొదటి ఐదు సంవత్సరాల్లోపే 90 శాతం విఫలమవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఎందుకంటే వ్యాపారంలో కస్టమర్ల అభిరుచుల(Customer preferences)కు తగ్గట్లు ఓపెనింగ్ చేయకపోవడం. ఒక్కసారి కస్టమర్ వస్తే మరికొంతమందిని తీసుకొచ్చేలా ప్రత్యేక మెనూ లేకపోవడమూ ఓ కారణం.
పని రావాల్సిందే..
ఏ వ్యాపారం మొదలు పెట్టినా సొంతంగా పనివస్తేనే పెట్టుబడి పెట్టాలి. అలా కాకుండా వర్కర్లను తీసుకుంటే వచ్చే లాభాలు మొత్తం జీతాలకే వెళ్లిపోతాయి. వ్యాపారంలో త్వరగా లాభాలు చూడాలంటే తక్కువ మందితో ఎక్కువ పని అయ్యేలా చూసుకోవాలి. లేదంటే ఖర్చులు తడిసి మోపెడవువుతాయి.
వ్యాపారం ఎక్కడ పెట్టాలి..
ఫుడ్ బిజినెస్(Food business) ఎక్కువ జన సంచారం ఉన్న ప్రాంతాల్లో పెట్టాలి. ఫుడ్ కోర్ట్(Food Court), టీ పాయింట్‌లను రోడ్ల వెంట, ఆస్పత్రుల ఏరియాల్లో, బస్టాండ్‌ల సమీపంలో, కూరగాయల మార్కెట్‌ల పక్కన ఏర్పాటు చేసుకోవాలి. కార్మికులు ఎక్కువగా ఉండే చోట, మెయిన్ రోడ్ల వెంట, కార్యాలయాలు, ఆహ్లాదకర ప్రాంతాల్లో టీ స్టాళ్లు క్లిక్ అవుతాయి.
క్వాలిటీ ముఖ్యం
ఫుడ్ బిజినెస్‌లో క్వాలిటీ మెయింటేన్ చేస్తేనే కస్టమర్లు ఆకర్షితులవుతారు. ప్రస్తుతం జనం హైజీనిక్ ఫుడ్ (Hygienic food) కోసం వెతుకుతున్నారు. ఎక్కడపడితే అక్కడ తినడానికి ఇష్టపడడం లేదు. టేబుళ్లు, కుర్చీలు, గ్లాసులు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుండాలి.
లాభాలు రావాలంటే
టీ స్టాల్‌లో స్నాక్స్(Snacks), కూల్ డ్రింక్స్(Cool drinks) వంటి వాటిని ఏర్పాటు చేసుకోవచ్చు. వీటితో వ్యాపారంలో లాభాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ప్రైమ్ లొకేషన్స్(Prime locations)లో ఏర్పాటు చేస్తే నెలకు కనీసం రూ. 50 వేల వరకు లాభాలు ఆర్జించవచ్చు.
నేను రూ.5 లక్షలు నష్టపోయా..
ఓ టీ పాయింట్ ఫ్రాంచైజీకి రూ.3.5 లక్షలు ఇచ్చా. షాపు, ఇతర ఖర్చులకు మరో లక్షన్నర పెట్టా. మెయిన్ రోడ్డు పక్కనే షాపు కిరాయికి తీసుకున్నారు. మొదట్లో షాపు బాగా నడిచింది. ఆ తర్వాత కస్టమర్ల సంఖ్య పెరగలేదు. పెట్టుబడి ఖర్చుల వరకే ఇన్‌కమ్ వచ్చేది. ఓ ఏడాది పాటు ఎలాగోలా నడిపించాను. ఆ తర్వాత ఫ్రాంచైజీని ఎవరికైనా అమ్మేందుకు ట్రై చేశా. ఎవరూ కొనలేదు. దీంతో షాపు ఎత్తేయాల్సి వచ్చింది. మొత్తంగా రూ.5 లక్షల వరకు నష్టపోయా.
-రాజు, కరీంనగర్