Sridhar Babu: తెలంగాణ యువతకు శుభవార్త.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీ(Blockchain City)ని ఏర్పాటు చేయబోతున్నట్లు రాష్ర్ట మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) ప్రకటన చేశారు. ఎక్కడ ఏర్పాటు చేయాలి.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీ(Blockchain City)ని ఏర్పాటు చేయబోతున్నట్లు రాష్ర్ట మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) ప్రకటన చేశారు. ఎక్కడ ఏర్పాటు చేయాలి.. ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలనే అంశంపై ఇప్పటికే సంబంధిత పరిశ్రమలు, నిపుణులతో సంప్రదింపులు ప్రారంభించామన్నారు. శుక్రవారం మాదాపూర్‌లో డ్రోన్ టెక్నాలజీ, రోబోటిక్స్ రంగంలో సుమారు 1800 మందికి ఉపాధి కల్పిస్తున్న ‘సెంటిలియన్ నెట్ వర్క్స్ అండ్ హెచ్‌సీ రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ నూతన క్యాంపస్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కొత్త సాంకేతికల ఆవిష్కరణలో తెలంగాణను నంబర్ వన్‌గా నిలిచేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆయా రంగాల్లో తెలంగాణ యువతకు స్కిల్స్ యూనివర్సిటీ, పరిశ్రమల సహకారంతో శిక్షణ ఇచ్చి.. ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఫ్యూచర్ సిటీ(Future City)లో నిర్మించతలపెట్టిన ఏఐ యూనివర్సిటీకి త్వరలో శంఖుస్థాపన చేయబోతున్నామని అన్నారు. ప్రత్యేకంగా క్వాంటం కంప్యూటింగ్‌లో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్‌ను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు.
‘దేశంలో ఫ్రాంటియర్ టెక్నాలజీ హబ్‌ను ఏర్పాటు చేసే యోచనలో కేంద్రం ఉందని.. ఆ హబ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలంటూ ఇప్పటికే కేంద్రాన్ని కోరినట్లు చెప్పుకొచ్చారు. ఇక్కడి అనుకూలతలను ప్రత్యేకంగా వివరించినట్లు తెలిపారు. ఈ విషయంలో కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నమని అభిప్రాయపడ్డారు. ‘పౌర సేవలను చివరి వ్యక్తి వరకు సమర్థవంతంగా అందించాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఏఐ, బ్లాక్ చెయిన్ తదితర ఎమర్జింగ్ టెక్నాలజీస్‌ను విరివిగా వినియోగించుకోబోతున్నాం. ఇటీవలి కాలంలో కీలకంగా మారిన డ్రోన్ టెక్నాలజీపై తెలంగాణ యువతకు ప్రత్యేకంగా శిక్షణనిచ్చి.. వారికి ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కసరత్తు చేస్తున్నాం’ అని వివరించారు.