Seethakka: ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగానికి మంత్రి సీతక్క కీలక ఆదేశాలు
భారీ వర్షాల వల్ల మరో రెండు రోజుల పాటు ప్రజలతో పాటు అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సూచించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: భారీ వర్షాల వల్ల మరో రెండు రోజుల పాటు ప్రజలతో పాటు అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ గా ఉన్న ఆమె జిల్లాలో వర్షాలు, వరద పరిస్థితులపై అధికారులను ఆరా తీశారు. ములుగులో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ఫోన్ల ద్వారా ఆదిలాబాద్ అధికారులను అప్రమత్తం చేశారు. అంతేగాక వరదలపై జిల్లా అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు జిలాల్లో వరద పరిస్థితులపై సమాచారం అందించాలని, సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని అధికారులను ఆదేశించారు.
వాయుగుండం కారణంగా మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉందని, ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని అధికారులు ప్రజలకు సూచించాలని చెప్పారు. వరద ఉదృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రాకపోకలు నియంత్రించాలని, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న చోట గస్తీ పెంచాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, ముంపు ప్రమాదం ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు మంత్రి సీతక్క సూచనలు చేశారు.