పెసా చ‌ట్టంపై మంత్రి సీత‌క్క కీలక వ్యాఖ్యలు

ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి కోసం గ్రామస‌భ‌ల‌కు సంపూర్ణ అధికారాలు కట్టబెట్టాల‌ని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి సీత‌క్క విజ్ఞప్తి చేశారు...

Update: 2024-09-26 16:40 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి కోసం గ్రామస‌భ‌ల‌కు సంపూర్ణ అధికారాలు కట్టబెట్టాల‌ని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి సీత‌క్క విజ్ఞప్తి చేశారు. ఆదివాసీ, గిరిజ‌న ప్రజ‌ల అభివృద్ధి అవ‌స‌రాల కోసం గ్రామ స‌భ‌లు తీసుకున్న నిర్ణయాలు అమ‌లయ్యేలా చూడాల‌ని కోరారు. ఏజెన్సీ ప్రాంత ప్రజ‌ల క‌నీస అవ‌స‌రాల‌కు ఆటంకాలు క‌లిగించ‌కుండా అట‌వీ, ప‌ర్యవ‌ర‌ణ శాఖ‌ను స‌మ‌న్వయం చేయాల‌న్నారు. గురువారం ఢిల్లీ అంబేద్కర్ ఇంట‌ర్నేష‌న‌ల్ సెంట‌ర్‌లో షెడ్యూల్ ప్రాంతాల‌కు పంచాయ‌తీ చ‌ట్టాన్ని వ‌ర్తింప చేసే పెసా చ‌ట్టంపై జ‌రిగిన జాతీయ స‌ద‌స్సుకు సీత‌క్క హాజ‌ర‌య్యారు. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ నిర్వహించిన స‌ద‌స్సును ఆ శాఖ స‌హాయ‌ మంత్రి ఎస్.పి. సింగ్ బఘేల్‌తో క‌లిసి జ్యోతి ప్రజ్వల‌న చేసి ప్రారంభించారు. పెసా చట్టం అమ‌ల్లో ఎద‌ర‌వుతున్న స‌మ‌స్యలు, వాటి ప‌రిష్కారం కోసం తీసుకోవాల్సిన చ‌ర్యల‌పై మంత్రి సీత‌క్క ప్రసంగించారు. భార‌త రాజ్యంగంలోని ఐదో షెడ్యుల్లోని గిరిజ‌న ప్రాంతాల్లో అభివృద్ధి కోసం భార‌త ప్రభుత్వం 1996లో చేసిన‌ పెసా చ‌ట్టం అమ‌లుకు కేంద్ర అట‌వీ, ప‌ర్యవ‌ర‌ణ శాఖ నిబంధ‌న‌లు ఆటంకంగా మారాయ‌ని సీత‌క్క ఆవేద‌న వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు అట‌వీ శాఖ అనుమతులు ఇవ్వడం లేద‌ని తెలిపారు. కనీస వసతులు కల్పన‌కు సైతం సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తోందన్నారు.

త‌న నియోజ‌క‌వ‌ర్గం ములుగులో పాఠశాల భవనానికి అనుమతి లేకపోవడంతో కంటైనర్ పాఠశాలను ఏర్పాటు చేయాల్సి వచ్చిందని మంత్రి సీతక్క గుర్తు చేశారు. విద్యుత్ లైన్లు వేసేందుకు కేంద్ర అట‌వీ శాఖ అనుమ‌తులివ్వని కార‌ణంగా ఆదివాసీ గుడాలు నేటికి క‌రెంటు వెలుగుల‌కు నోచుకోవ‌డం లేద‌న్నారు. ఐటీడీఏ ఏటూరు నాగారం ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ చార్జింగ్ పాయింట్లలో మోబైల్ ఫోన్లను చార్జ్ చేసుకుని, రాత్రి వెలుగు కోసం వాటిని వాడుతున్నార‌ని తెలిపారు. అట‌వీ గ్రామాల్లో సోలార్ విద్యుత్ మోట‌ర్లతో మంచి నీటిని స‌ర‌ఫ‌రా చేయాల్సి వ‌స్తుంద‌న్నారు. అటవీ ప్రాంతాలు, వ‌న్యప్రాణుల అభ‌యార‌ణ్యాల్లో మైనింగ్, భారీ ప్రాజెక్టులకు అనుమతులు వేగంగా మంజూరు అవుతుండ‌గా, అడవి పుత్రులకు కనీస సదుపాయాలు కల్పించే విషయంలో మాత్రం అటవీ శాఖ అనుమతులు ఇవ్వడం లేద‌ని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పీఎం జ‌న్‌మ‌న్, పీఎం జుగా వంటి ప‌లు పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ, అట‌వీ శాఖ అనుమ‌తులివ్వని కార‌ణంగా ఆ నిధుల‌ను వినియోగించలేని పరిస్థితి నెల‌కొంద‌ని వెల్లడించారు. అనేక గిరిజన గ్రామాలకు నేటికీ సరైన రోడ్డు సదుపాయం, విద్యుత్తు సదుపాయం, మౌలిక వసతులు లేక‌పోవ‌డానికి అటవీ, పర్యావరణ శాఖ అనుమతులు నిరాక‌రించ‌డమే ప్రధాన కార‌ణ‌మ‌ని మంత్రి సీత‌క్క వెల్లడించారు.

అందుకే స్థానిక ఆదివాసీ, గిరిజ‌న ప్రజ‌ల అభివృద్ధి కోసం పెసా చ‌ట్టంలో పొందు ప‌రిచిన విధంగా గ్రామ స‌భ‌ల‌కు నిర్ణయాధికారాన్ని కట్టబెట్టాల‌ని మంత్రి సీతక్క కోరారు. గ్రామస‌భ‌ల తీర్మాణానికి అనుగుణంగా జ‌రిగే అభివృద్ది కార్యక్రమాలకు కేంద్ర అట‌వీ, ప‌ర్యవ‌ర‌ణ‌ శాఖ అభ్యంత‌రాలు పెట్టకుండా కేంద్రం చ‌ర్యలు తీసుకోవాల‌న్నారు. గ్రామస‌భ‌ల తీర్మానం ఉంటే చాలు స్థానిక అభివృద్దికి అట‌విశాఖ అనుమ‌తులు మంజూరు చేయాల‌న్నారు. పెసా చ‌ట్టానికి ప్రధాన ఆటంకంగా మారిన అటవీ శాఖ నిబంధ‌న‌ల‌ను స‌వ‌రించాల‌ని మంత్రి సీత‌క్క కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు.

సీత‌క్క ప్రతిపాద‌న‌ను ఇత‌ర రాష్ట్రాల మంత్రులు స‌మ‌ర్దిస్తూ త‌మ అభిప్రాయాల‌ను వ్యక్త ప‌రిచారు. పెసా వ‌ర్సెస్ ఫారెస్ట్ యాక్ట్ అన్నట్లుగా ప‌రిస్థితి మార‌డం వ‌ల్ల ఆదివాసీ గిరిజ‌నులు అభివృద్దికి అంత‌గా నోచుకోవ‌డం లేద‌ని తెలిపారు. అందుకే గ్రామ స‌భ‌ల‌కు సంపూర్ణ అధికారం క‌ట్టబెడుతూ, అట‌వీ ప‌ర్యావ‌ర‌ణ శాఖ చ‌ట్టంలోని ప‌లు నిబంధ‌న‌ల‌న‌ను స‌వ‌రించాల‌ని కోరారు.

15వ ఆర్దిక సంఘం నిధులు విడుద‌ల చేయండి: కేంద్ర మంత్రికి సీత‌క్క విజ్ఞప్తి

రాష్ట్రంలోని స్థానిక పంచాయతీలకు ఎన్నిక‌లు జ‌ర‌గ‌లేద‌న్న కార‌ణంతో గ్రామ పంచాయ‌తీల‌కు కేంద్రం ప్రభుత్వం నిలిపి వేసిన 15వ ఆర్థిక సంఘం నిధుల‌ను విడుద‌ల చేయాల‌ని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ స‌హాయ‌ మంత్రి ఎస్.పి. సింగ్ బఘేల్‌ను మంత్రి సీత‌క్క కోరారు. పెసా చ‌ట్టంపై జ‌రిగిన జాతీయ స‌ద‌స్సు సంద‌ర్భంగా బఘేల్‌ను ప్రత్యేకంగా క‌లిసి… తెలంగాణ‌కు రావాల్సిన నిధుల‌ను విడుద‌ల చేయ‌ల‌ని విజ్ఞప్తి చేశారు. గ్రామ పంచాయ‌తీల‌కు నిధులు విడుద‌ల కాక‌పోవ‌డం వ‌ల్ల అభివృద్ధి కుంటుప‌డుతుంద‌ని బ‌ఘేల్ దృష్టికి తీసుకెళ్ళారు. అయితే సీత‌క్క విజ్ఞప్తికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. ఇత‌ర రాష్ట్రాల నుంచి సైతం ఇదే ర‌క‌మైన విజ్ఞప్తులు వ‌స్తున్నందున‌, గ్రామ పంచాయ‌తీల‌కు నిధులు విడుద‌ల అంశాన్ని ప‌రిశీలిస్తామ‌ని కేంద్ర మంత్రి హ‌మీ ఇవ్వగా సీత‌క్క కృత‌జ్ఞత‌లు తెలిపారు.


Similar News