విత్తన రంగ పరిశ్రమలకు ప్రభుత్వం చేయూత: మంత్రి తుమ్మల

విత్తన రంగ పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు హామీ ఇచ్చారు. ఫిక్కీ భవన్ లో గురువారం సీడ్మెన్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు.

Update: 2024-09-26 16:18 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: విత్తన రంగ పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు హామీ ఇచ్చారు. ఫిక్కీ భవన్ లో గురువారం సీడ్మెన్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అన్ని విత్తన కంపెనీలకు సీడ్మెన్ అసోసియేషన్ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తూ తెలంగాణను విత్తనోత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారన్నారు. రాష్ట్రంలో సుమారు 8 లక్షల ఎకరాలలో వివిధ పంటల విత్తనోత్పత్తి జరుగుతూ, కేవలం రాష్ట్ర అవసరాలకే కాకుండా దేశ అవసరాలను తీర్చే స్థాయికి ఈ రంగాన్ని తీసుకెళ్లారన్నారు. మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు. విత్తనోత్పత్తి రంగంలో లక్ష కుటుంబాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉపాధి పొందుతున్నాయన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం విత్తనోత్పత్తి రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. సాధారణ పంట రుణాల కంటే విత్తనోత్పత్తి పంటలు సాగుచేసే రైతులకు 30% నుండి 50% మేర రుణాలు పెంచి ఇవ్వాలని బ్యాంకర్లకు ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఆర్థికంగా పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ, కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ ప్రకటించి ఇప్పటికే 18,000 కోట్లు విడుదల చేసి 22 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేశామన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందరూ కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు ఏ ఒక్క ప్రాంతంలో ఫలానా కంపెనీ విత్తన లోపం వల్ల పంట నష్టపోయాం అనే మాట రాకూడదని అన్నారు. రైతులకు నష్టం జరిగితే విత్తన చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


Similar News