Minister Seethakka: పేద‌ల జీవితాల్లో మార్పు తేవ‌డ‌మే ల‌క్ష్యం: మంత్రి సీత‌క్క

తెలంగాణలోని నిరుపేదల జీవితాల్లో మార్పు తీసుకురావడమే త‌మ ప్రభుత్వ లక్ష్యమని పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీత‌క్క స్పష్టం చేశారు.

Update: 2024-08-20 15:43 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలోని నిరుపేదల జీవితాల్లో మార్పు తీసుకురావడమే త‌మ ప్రభుత్వ లక్ష్యమని పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీత‌క్క స్పష్టం చేశారు. పేదరికం నుంచి వచ్చిన త‌న‌కు పేదలతో పేగుబంధం ఉందన్నారు. బ‌హు రూపాల్లో ఉన్న పేదరికాన్ని రూపుమాపే దిశలో త‌మ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తుంద‌ని గుర్తు చేశారు. పేదరిక నిర్మూలన కోసం త‌మ‌ ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో పాలుపంచుకోవాల‌ని స్వచ్చంధ సంస్థల‌కు పిలుపునిచ్చారు. మంగ‌ళ‌వారం తెలంగాణ స‌చివాలయంలో మంత్రి సీత‌క్క స‌మ‌క్షంలో గ్రామీణ పేద‌రిక నిర్మూల‌న‌ సంస్థ (సెర్ఫ్), ప‌లు దేశాల్లో పేద‌రిక నిర్మూల‌న కోసం ప‌నిచేస్తున్న బ్రాక్ ఇంటర్నేషనల్ అనే అంత‌ర్జాతీయ సంస్థ అవ‌గాహ‌న కుదుర్చుకున్నాయి.

ఈ అవ‌గాహ‌న మేర‌కు తెలంగాణలోని కొమురం భీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట్, వికారాబాద్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా 4 వేల అత్యంత పేద కుటుంబాలను గుర్తించి వారిని పేద‌రికం నుంచి బ‌య‌ట‌కి తెచ్చేలా బ్రాక్ ప‌ని చేయ‌నుంది. మూడేళ్ల కాలం పాటు ఆయా కుటుంబాల‌కు నైపుణ్య శిక్షణనివ్వడం మొద‌లుకుని మెరుగైన జీవ‌నోపాధి క‌ల్పించేదాకా అన్ని విధాలుగా బ్రాక్ స‌హ‌య స‌హ‌కారం అందిచ‌నుంది. దానికి సంబంధిచిన విధివిధానాల‌పై చ‌ర్చ జ‌ర‌గ్గా మంత్రి సీత‌క్క ప‌లు కీల‌క సూచ‌న‌లు చేశారు. పేద‌రిక నిర్మూలన విధివిధానాలు న‌గ‌రాల్లో ర‌చిస్తే స‌రిపోద‌ని.. క్షేత్ర స్థాయిలో ప్రజ‌లు ఆశిస్తున్న దానికి అనుగుణంగా కార్యచ‌ర‌ణ సిద్ధం చేయాల‌ని సూచించారు.

ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నా స‌మాజంలో ఇంకా అస‌మాన‌త‌లు పెర‌గ‌డం, పేద‌రికం ఉండ‌టం బాధ‌క‌ర‌మ‌ని అన్నారు. ఆర్థిక రంగంలో దేశం దూసుక‌పోతున్నా నిరుపేదలకు, అట్టడుగు వర్గ ప్రజలు కనీస అవ‌స‌రాల‌కు నోచుకోవ‌డం లేద‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. మారిన అవసరాల నేపథ్యంలో సామాన్యులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. బహురూపాల్లో ఉన్న పేదరికాన్ని అంత‌మొందించేందుకు త‌మ ప్రభుత్వంలో కలిసి పని చేయాలని స్వచ్చంధ సంస్థల‌కు పిలుపునిచ్చారు. ప్రభుత్వం, ప్రజా సంఘాలు, సేవా సంస్థలు అంకితభావంతో పని చేస్తే పేదరికం అనేది ఉండదని అన్నారు. పేద‌ల‌కు నైపుణ్య శిక్షణనిచ్చి సుస్థిరమైన జీవనోపాధి క‌ల్పించే దిశ‌లో త‌మ ప్రభుత్వానికి చేయుత‌నివ్వాల‌ని కోరారు.

ఈ కార్యక్రమంలో మంత్రి సీత‌క్కతో పాటు పంచాయ‌తీ రాజ్ గ్రామీణాభివృద్ది శాఖ కార్యద‌ర్శి లోకేష్ కుమార్, సెర్ఫ్ సీఈవో దివ్యా దేవ‌రాజ‌న్, ప‌లు జిల్లాల అడిష‌న‌ల్ క‌లెక్టర్లు, డీఆర్డీవోలు, బ్రాక్ ఇంట‌ర్నేష‌ల్ సంస్థ ఇండియ‌న్ హెడ్ శ్వేతా బెనర్జీ, ఆగాఖాన్ ఫౌండేషన్ సీఈవో టిన్ని స్వహ్ని, ప్రధాన్, క్రిస్ప్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. క్షేత్ర స్థాయిలో ఉన్న వాస్తవ ప‌రిస్థితుల‌పై తాము చేసిన అధ్యయ‌న వివ‌రాల‌ను పంచుకున్నారు. అయితే, తెలంగాణ‌లో పేద‌ల‌కు మెరుగైన శిక్షణ ఇచ్చి వారికి స్థిర‌మైన జీవ‌నోపాధి క‌ల్పించేందుకు ముంద‌కు వ‌చ్చిన అంత‌ర్జాతీయ సంస్థ బ్రాక్, ఇత‌ర సంస్థల ప్రముఖుల‌ను మంత్రి అభినందించి స‌త్కరించారు.

Tags:    

Similar News