Seethakka: మీ పని తీరేంటో కేసీఆర్ మనువడే బయటపెట్టారు.. మాజీ మంత్రికి సీతక్క కౌంటర్
సబితా ఇంద్రారెడ్డికి మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు.
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ తీరు ఆత్మ స్తుతి పరనింద అన్నట్లుగా ఉందని మంత్రి సీతక్క (Seethakka) విమర్శించారు. అధికారంలో ఉన్నంత కాలం ఏనాడు బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ గురించి ఆలోచించని బీఆర్ఎస్ కేవలం ఎన్నికల షెడ్యూల్ కు మూడు రోజుల ముందు ఈ పథకాన్ని ప్రారంభించి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించిందని ధ్వజమెత్తారు. ఇవాళ శాసనసభలో విద్యాశాఖ పద్దుపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) వ్యాఖ్యలపై సీతక్క ఫైర్ అయ్యారు. పిడికెడు పాఠశాలల్లో ఈ పథకాన్ని ప్రారంభించి ప్రచారం చేసుకున్నారని దీని కోసం ఒక రూపాయి కూడా చెల్లించలేదన్నారు. మూడున్నర కోట్ల పెండింగ్ బిల్లులను మా ప్రభుత్వం వచ్చాక చెల్లించిందని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో విద్యాశాఖ దుస్థితి ఎలా ఉండేదో స్వయంగా కేసీఆర్ (KCR) మనవడే ప్రపంచానికి చెప్పారని, ముక్కు మూసుకుని గౌలిదొడ్డి పాఠశాలను సందర్శించి ఇలాంటి పాఠశాలలను చూడలేదని ఆవేదన వ్యక్తం చేశాడని గుర్తు చేశారు. పాఠశాలల సంఖ్యను పెంచామని గొప్పలు చెప్పుకుంటున్న బీఆర్ఎస్ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయిందని విమర్శించారు.