Minister Seethakka: పాఠ్యాంశంగా ‘హౌ టు రెస్పెక్ట్ విమెన్’: మంత్రి సీతక్క కీలక ప్రకటన

రాష్ట్రంలో ‘హౌ టు రెస్పెక్ట్ విమెన్’ టాపికును పాఠ్యాంశంగా చేరుస్తామని, శిక్షా, శిక్షణ ఏక కాలంలో జరిగినప్పుడే నేరాలు తగ్గు ముఖం పడతాయని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.

Update: 2024-08-29 14:15 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ‘హౌ టు రెస్పెక్ట్ విమెన్’ టాపికును పాఠ్యాంశంగా చేరుస్తామని, శిక్షా, శిక్షణ ఏక కాలంలో జరిగినప్పుడే నేరాలు తగ్గు ముఖం పడతాయని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. నేరం జరిగిన వెంటనే బాధితులకు సత్వర న్యాయం చేయడంతో పాటు, నిందితులకు త్వరగా శిక్ష పడేలా వ్యవస్థలను మెరుగుపరచాలని సూచించారు. మానవ అక్రమ రవాణా నివారణ కోసం చేపట్టాల్సిన చర్యల‌పై హైదరాబాద్ హెచ్ఐసీసీలో తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సును ప్రారంభించిన అనంతరం మంత్రి సీతక్క ప్రసంగించారు. తెలంగాణలో అమ్మాయిలు, మహిళల భద్రత కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. తెలంగాణలో అమలవుతోన్న షీ టీం వ్యవస్థ, టీ సేఫ్ యాప్ మహిళలకు భద్రత కల్పించడంతో పాటు భరోసానిస్తుందని అన్నారు. మహిళలపై నేరాలను తగ్గించే విధంగా ఉమెన్స్ సేఫ్టీ వింగ్ డీజీ శిఖా గోయల్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ పని చేస్తుందని అభినందించారు.

పేదరికం, వెట్టిచాకిరి ఆసరాగా కూలీలు, మహిళలు, పిల్లలను అక్రమ రవాణా చేస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే మానవ అక్రమ రవాణా నివారణ కోసం దాని చుట్టూ అల్లుకుని ఉన్న ఆర్థిక సమస్యలను ఛేదించేలా చర్యలు చేపట్టాలన్నారు. సమాజం ఎంతో అభివృద్ధి చెందుతున్న మనుషుల ఆలోచన ధోరణి మారటం లేదని మంత్రి సీతక్క పేర్కొన్నారు. మహిళల పట్ల చిన్నచూపు కొనసాగడమే హత్యలకు, మానభంగాలకు కారణమవుతోందని తెలిపారు. మహిళలను సెక్స్ సింబల్‌గా, వ్యాపార వస్తువుగా చూసే విధానం పోవాలన్నారు. అన్ని స్థాయిల్లో మహిళలు ఏదో ఒక రూపంలో వేధింపులు ఎదుర్కోవాల్సి రావడం బాధాకరమన్నారు. కోల్‌కతాలో ప్రభుత్వ ఆసుపత్రిలోని డాక్టర్‌కు భద్రత లేకపోతే, ఇంకా మహిళలకు ఎక్కడ భద్రత ఉంటుందని మంత్రి ప్రశ్నించారు. పురుషుల మైండ్ సైట్ మారినప్పుడే మహిళలు అన్ని రంగాల్లో సమానంగా రాణించగలుగుతారని పేర్కొన్నారు.

నేరస్థులను త్వరగా శిక్షించడంతో పాటు, నేరం జరగకముందే ఆ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. మహిళలను గౌరవించడాన్ని పాఠశాల స్థాయి నుంచే పాఠ్యాంశంగా బోధిస్తామన్నారు. తమ పిల్లలకి మహిళలను గౌరవించడం నేర్పాలని, లింగ బేధం లేకుండా అమ్మాయి అబ్బాయిలను మధ్య ఎలాంటి వివక్ష చూపకుండా సమానంగా పెంచాలని తల్లిదండ్రులకు హితవు పలికారు. గతంలో బస్టాప్ లో మహిళలు ఒంటరిగా నిలబడాలంటే భయపడేవారు, కానీ బస్ ప్రయాణం కల్పించిన తర్వాత మహిళలు ఎక్కువ సంఖ్యలు బస్టాప్ లో ఉంటున్నారు. దీంతో పోకిరీలు ఆకతాయిలు కిడ్నాప్ల బెడదలు లేవని చెప్పారు. అందుకే మహిళా భద్రత కోసం ఉచిత బస్సు ప్రయాణం తరహాలో మరిన్ని కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మహిళలకు ఆర్థిక భద్రతతో పాటు సామాజిక భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళలు, చిన్నారులు మీద జరుగుతున్న అఘాయిత్యాలకు గంజాయి వ్యసనం కారణాలుగా కనిపిస్తున్నాయని అన్నారు.

ఈ క్రమంలో మొత్తం వ్యసనాల నుంచి సమాజాన్ని బయటికి తీసుకొచ్చేలా డ్రగ్స్ మహమ్మారిపై తమ ప్రభుత్వం యుద్ధం చేస్తుందని తెలిపారు. నేరస్తులపై చర్యలు తీసుకునే విధంగా పోలీస్ వ్యవస్థకు తమ ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చిందని, ఇక్కడ ఎవరికీ తలవంచకుండా పోలీసులు వ్యవస్థ పని చేయాలని మంత్రి కోరారు. నేరం ప్రాతిపదికన పని చేయాలి తప్ప నేరస్తుడి బ్యాక్‌గ్రౌండ్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. హైడ్రా తరహాలో అందరి పట్ల ఒకే రకంగా వ్యవహరించాలని పోలీసులకు సూచించారు. గుడిసెలో బతికే ఆడబిడ్డకైనా నేనున్నాను.. అనే భరోసా పోలీస్ శాఖ కల్పించినప్పుడే మహిళ సాధికారత సాధ్యపడుతుందన్నారు. రెండు రోజుల పాటు మానవ అక్రమ రవాణాపై చర్చించి కార్యచరణ రూపొందిస్తే అమలు చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి సీతక్క తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క‌తో పాటు డీజీపీ జితేందర్, ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ శిఖా గోయల్, సెర్ఫ్ సీఈవో దివ్యా దేవరాజన్, సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, ప్రజ్వల ఫౌండేషన్ నిర్వాహకురాలు సునీతా కృష్ణన్‌తో పాటు ఐదు రాష్ట్రాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు.


Similar News