ముగిసిన ‘స్వదేశీ మేళా’.. చీఫ్ గెస్ట్‌గా మంత్రి జూపల్లి

స్వదేశీ జాగరణ మంచ్, స్వావలంబి భారత్ అభియాన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజా లో నిర్వహిస్తున్న స్వదేశీ మేళా కార్యక్రమం ఆదివారంతో ముగిసింది.

Update: 2024-10-27 16:18 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: స్వదేశీ జాగరణ మంచ్, స్వావలంబి భారత్ అభియాన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజా లో నిర్వహిస్తున్న స్వదేశీ మేళా కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు, స్వదేశీ జాగరణ మంచ్ అఖిల భారత సహ సంఘటక్ సతీష్ జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం, స్థానికంగా తయారైన వస్తువులను వినియోగించడం వలన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసినట్లవుతుందని తెలిపారు. ఎంతోమంది చిరు వ్యాపారస్తులకు ఉపాధి దొరుకుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధిని పెంచడంతోపాటు స్థానికంగా తయారయ్యే వస్తువులకు అపరిమిత మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించి తెలంగాణ ఔన్నత్యాన్ని చాటేలా అనేక చర్యలు తీసుకుంటోందని వివరించారు. భావజాలానికి సంబంధం లేకుండా స్వదేశీ జాగరణ మంచ్, స్వావలంబి భారత్ అభియాన్ స్వదేశీ ఉత్పత్తుల ప్రాచుర్యం కోసం నిర్వహిస్తున్న స్వదేశీ మేళాను అభినందించారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు.

అనంతరం సతీష్ జీ మాట్లాడుతూ వోకల్ ఫర్ లోకల్ నినాద స్ఫూర్తితో స్వదేశీ జాగరణ మంచ్, స్వావలంబి భారత అభియాన్ స్వదేశీ ఉత్పత్తుల ప్రాచుర్యాన్ని దేశవ్యాప్తంగా ఒక మహా ఉద్యమంగా నిర్వహిస్తోందన్నారు. ఒక రాష్ట్రంలోని స్థానిక ఉత్పత్తులను మరొక రాష్ట్రానికి స్టాల్స్ ద్వారా పరిచయం చేయడం వల్ల వ్యాపార విస్తరణతో పాటు స్థానిక వ్యాపారస్తులకు అమితమైన ప్రోత్సాహం కలుగుతుందని అన్నారు. స్వదేశీ మేళాలో కశ్మీర్ నుంచి మొదలుకొని రాజస్థాన్, తమిళనాడు, కర్ణాటక లాంటి అన్ని రాష్ట్రాల నుంచి దాదాపుగా స్వదేశీ ఉత్పత్తులతో కూడిన 350 స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు స్వదేశీ జాగరణ మంచ్ తెలంగాణ ప్రాంత ప్రచార ప్రముఖ్ కేశవ్ సోని తెలిపారు. ఈ స్టాల్స్ ద్వారా ప్రజలకు దేశవ్యాప్తంగా ఉన్న అనేక స్వదేశీ స్థానిక ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకొచ్చినట్లయిందన్నారు. ఈ కార్యక్రమంలో దేవేంద్ర ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ తూళ్ల వీరేందర్ గౌడ్, స్వదేశీ జాగరణ మంచ్ డాక్టర్ ఎస్ లింగమూర్తి, స్వదేశీ జాగరణ మంచ్ తెలంగాణ ప్రాంత కన్వీనర్ హరీశ్ బాబు, స్వావలంబి భారత్ అభియాన్ ప్రాంత కన్వీనర్ జీ రమేష్ గౌడ్, స్వదేశీ మేళా కన్వీనర్ ఇంద్రసేన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Similar News