ఆగస్ట్ 13 నుంచి మంత్రి సీతక్క జిల్లాల పర్యటన

ఈ నెల 13 నుంచి రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల వారీగా రోజుకో జిల్లాలో తమ శాఖలకు సంబంధించి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు పంచాయతీరాజ్, మహిళా సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క వెల్లడించారు.

Update: 2024-08-08 17:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల 13 నుంచి రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల వారీగా రోజుకో జిల్లాలో తమ శాఖలకు సంబంధించి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు పంచాయతీరాజ్, మహిళా సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క వెల్లడించారు. 13వ తేదీ నుంచి (మధ్యలో వచ్చే సెలవు రోజులు, పబ్లిక్‌ హాలిడేస్‌ మినహాయించి) నిర్వహించే శాఖల సమీక్షల్లో ఆయా శాఖల అధికారుల నుంచి అమలౌతున్న అభివృద్ధి పనులు, మొత్తంగా సాగుతున్న కార్యక్రమాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టనున్నట్టు తెలియజేశారు. గురువారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో మీడియా ప్రతినిధులతో మంత్రి సీతక్క ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం రేవంత్‌ రెడ్డి విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చాక అంగన్‌వాడిలలో ప్లే స్కూల్స్‌ను ప్రారంభించే కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తామన్నారు. ఇంతదాకా నగరాలు, పట్టణ ప్రాంతాల్లో అధికంగా కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ (సీఎస్‌ఆర్‌) ఫండ్స్‌ను కార్పొరేట్‌ సంస్థలు వినియోగిస్తుండగా... ఈ విధానంలో మార్పు తీసుకొచ్చేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఈ నిధులను వినియోగించాలని తాను చేసిన సూచనపై సానుకూలంగా స్పందించిన సంస్థలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఒక్కో సంస్థ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని, స్కూల్‌ బిల్డింగ్, ఆసుపత్రి, హాస్టల్‌ ఇలా ఏదైనా ప్రజలకు నిత్యం ఉపయోగపడే గుర్తుండిపోయే పని చేపట్టాలని ఇటీవల భేటీలో చేసిన సూచనలకు కార్పొరేట్‌ సంస్థలు ముందుకు రావడం ముదావాహమన్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో సిఎస్‌ఆర్‌ ఫండ్స్‌ పెట్టేందుకు వివిధ కార్పొరేట్‌ సంస్థల సంసిద్ధత వ్యక్తం చేయడంతో, గ్రామాల్లో మేలైన మార్పులు చోటుచేసుకుంటాయనే ఆశాభావాన్ని సీతక్క వ్యక్తం చేశారు.


Similar News