Onion Price : ఉల్లిగడ్డ కోస్తేనే కాదు.. కొనబోయిన కన్నీళ్లే.. ధరల కట్టడికి కేంద్రం నిర్ణయం ఇదే!

ఉల్లి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి.

Update: 2024-09-24 08:15 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఉల్లి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఉల్లిగడ్డలు కట్ చేస్తే కన్నీళ్లు వస్తాయి.. కానీ ఉల్లిగడ్డ ధరలు చూస్తేనే సామాన్య ప్రజలకు నేడు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ప్రస్తుతం హోల్ సెల్ కిలో రూ. 60 నుంచి రూ. 80 వరకు అమ్ముతున్నారు. నెల క్రితం కిలో రూ. 20 నుంచి రూ. 40 వరకు ఉన్న ఉల్లిగడ్డ ధర కేవలం 15 రోజుల్లోనే ధరలు రెట్టింపు అయ్యాయి. ఇంకా బయట మార్కెట్లలో కిలో రూ. 80 పైగా విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యులు ఉల్లిగడ్డల ధరలు చూసి షాక్ అవుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ఉల్లగడ్డను పండించేది కర్నూలు రైతులు.. ఇవాళ కర్నూలు మార్కెట్‌లో క్వింటాల్‌ ఉల్లి ధర రూ. 3.639 నుంచి రూ. 4,129 వరకు పలుకుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్నూలు నుంచి ఉల్లిగడ్డలు దిగుమతి అవుతాయి. అయితే దిగుమతి తగ్గినట్లు సమాచారం. మరోవైపు పెద్ద వ్యాపారులు ఉల్లిగడ్డలను బ్లాక్ మార్కెట్ చేయడం వల్లే ధరలు పెరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.

ధరల కట్టడికి కేంద్రం చర్యలు

ఉల్లి ధరల విషయంపై కేంద్రం స్పందించింది. ఈ నేపథ్యంలోనే ఉల్లి ధరల కట్టడికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే 4.7 లక్షల టన్నుల బఫర్ స్టాక్‌ను కేంద్రం విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకుంది. మరోవైపు రాయితీ ఉల్లిని కూడా రిటైల్‌గా విక్రయించే ఆలోచనలో కేంద్రం ఉంది. దేశవ్యాప్తంగా సబ్సిడీ ద్వారా రూ.35కు కిలో చొప్పున రిటైల్‌లో విక్రయించాలని భావిస్తున్నట్టు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖారే సోమవారం తెలిపారు. దీంతో రానున్న రోజుల్లో ఉల్లి ధరలు తగ్గే అవకాశం ఉంది.


Similar News