బతిమాలినా మీటింగ్‌కు రాలేదు.. మంత్రుల తీరుపై రేషన్ డీలర్ల అసహనం

Update: 2024-09-24 07:36 GMT

దిశ, పటాన్ చెరు: ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉంటూ ప్రభుత్వం నుంచి నిత్యావసర సరకులను ప్రజలకు చేరవేసే రేషన్ డీలర్లను రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తుందా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇందుకు నిదర్శనం పటాన్ చెరులో రాష్ట్ర స్థాయి రేషన్ డీలర్ల సమావేశానికి మంత్రులు డుమ్మా కొట్టాడం. 33 జిల్లాల్లో పల్లె నుంచి పట్నం వరకు వేలాదిగా రేషన్ డీలర్లు హాజరైన ఈ సమావేశానికి మంత్రులు దూరంగా ఉండడం తీవ్ర చర్చనీయాంశం అయింది. ఇప్పటికే పలు మార్లు మంత్రులను సంప్రదించిన వారు విముఖత వ్యక్తం చేయడంతో చివరకు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా మంగళవారం సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

మంత్రుల కోసమే వాయిదా వేసుRaకున్నాం..

గత ప్రభుత్వంలో రేషన్ డీలర్లకు ఇచ్చిన హామీలను అప్పటి ప్రభుత్వం విస్మరించిందని రేషన్ డీలర్లు చెప్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు డీలర్ల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని రేషన్ డీలర్ల రాష్ట్ర కమిటీ గత నెల 27న పటాన్ చెరు కేంద్రంగా సమావేశం నిర్వహించాలని నిర్ణయించుకున్నామన్నారు. ఈ సమావేశానికి పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జిల్లాకు చెందిన మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖను ఆహ్వానించమన్నారు. అయితే గత నెలలో బిజీ షెడ్యూల్ వల్ల హాజరు కాలేనని ఒక మంత్రి సమాధానం ఇవ్వడంతో మంత్రుల సమయానికి అనుకూలంగా కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నామని తెలిపారు. మళ్ళీ మంత్రుల వద్దకు వెళ్లి వారికి సమయం అడిగిన స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా వారు తమను పట్టించుకోకపోవడంతో నిరాకరించడంతో మంగళవారం సమావేశం నిర్వహించుకునేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. ఐతే ఈ సమావేశానికి ముగ్గురు మంత్రులు రాకపోవడం బాధ కలిగించిందని వాపోతున్నారు. అంతర్గత సంభాషణల్లో మంత్రుల తీరు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహకారంతో సమావేశాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఈ సమావేశానికి సహకారం అందించిన ఎమ్మెల్యే గూడెంకి రేషన్ డీలర్లు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సమావేశానికి 33 జిల్లాల నుంచి డీలర్లు..

పటాన్ చేరు కేంద్రంగా నిర్వహించిన రేషన్ డీలర్ల రాష్ట్ర స్థాయి సమావేశానికి 33 జిల్లాల నుంచి వేల సంఖ్యలో రేషన్ డీలర్లు హాజరయ్యారు. రేషన్ డీలర్లకు క్షేత్రస్థాయిలో ప్రజలతో చాలా సత్సంబంధాలు కలిగి ఉంటారు. కాంగ్రెస్ పార్టీ గెలుపులో రేషన్ డీలర్లు సైతం కీలక పాత్ర పోషించి గెలుపులో సహకరించారు. అయినా ప్రభుత్వం రేషన్ డీలర్లను విస్మరించడం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. 33 జిల్లాల నుంచి హాజరైన రేషన్ డీలర్ల సమావేశానికి మంత్రులు సమయం ఇవ్వకుండా తమను విస్మరించడంపై రేషన్ డీలర్లు గరం గరంగా ఉన్నారు. మంత్రుల వద్దకెళ్లి ప్రాధేయపడ్డ లెక్కచేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రస్థాయి సమావేశానికి ముగ్గురు మంత్రులలో కనీసం ఒక్క మంత్రి కూడా హాజరు కాకపోవడం తమను అవమానించడమేనని రేషన్ డీలర్లు మండిపడుతున్నారు. తాము ప్రభుత్వంతో సఖ్యతను కోరుకుంటున్న తమను నిర్లక్ష్యం చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద రేషన్ డీలర్ల రాష్ట్ర స్థాయి సమావేశానికి మంత్రులు డుమ్మా కొట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. గ్రామస్థాయిలో ప్రజలతో సత్సంబంధాలు కలిగిన రేషన్ డీలర్లు సహాయ నిరాకరణ చేస్తే ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు.


Similar News