Assembly: తమ్ముడూ నీ లైఫ్ స్టైల్ వేరు.. నా లైఫ్ స్టైల్ వేరు.. కౌషిక్ రెడ్డికి సీతక్క కౌంటర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం మధ్యాహ్నం ఆసక్తికర చర్చ జరిగింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ (TG Assembly) సమావేశాల్లో భాగంగా శనివారం మధ్యాహ్నం ఆసక్తికర చర్చ జరిగింది. రైతు సమస్యలు, రైతు రుణమాఫీ, వడ్ల బోనస్‌పై ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి (Padi Kaushik Reddy) వ్యాఖ్యలకు మంత్రి సీతక్క (Minister Seethakka) కౌంటర్ ఇచ్చారు. తమ్ముడూ నీ లైఫ్ స్టైల్ వేరు.. నా లైఫ్ స్టైల్ వేరు.. నియోజకవర్గంలో నేను తిరిగినట్లు నువ్వు తిరగలేవు అని మంత్రి చెప్పుకొచ్చారు. ప్రజలకు ఎవరు ఎక్కువ అందుబాటులో ఉంటారో తేల్చుకుందామని మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. సన్నవడ్లకు బోనస్ ఇవ్వడం లేదన్న కౌషిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సీతక్క ఖండించారు. హైదరాబాద్‌లో తిరిగే వాళ్లకు రైతులకు బోనస్ వస్తుందో లేదో తెలుస్తుందా? అని ప్రశ్నించారు. వడ్లకు బోనస్ ఇస్తమని బోగస్ చేసింది మీరు.. వరివేస్తే ఉరి అన్నది మీరు.. అని సీతక్క ఫైర్ అయ్యారు.
నేను ప్రభుత్వం వసతి కల్పించిన క్వార్టర్స్ లోనే నివసిస్తున్నా.. వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన భవనంలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు. నా కుమారుడు కూడా హన్మకొండలోనే ఉంటాడు.. నా జీవన విధానం ప్రజలకు తెలుసు.. అని అన్నారు. మీకు లాగా ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన కోటల్లో నివసించడం లేదని విమర్శించారు. మా ఇంటివి వచ్చి భోజనం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తున్నట్లు మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. అంతకు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి మాట్లాడుతూ.. గత బడ్జెట్‌లో రుణమాఫీకి రూ. 31 వేల కోట్ల బడ్జెట్ పెట్టారని, నేడు రూ.20,616 కోట్లు రుణమాఫీ చేసినట్లు చెబుతున్నారని, ఇంకా రూ.11 వేల కోట్లకు పైగా రుణమాఫీ ఎందుకు చేయాలేదని ప్రశ్నించారు. ఉదాహరణకు తన హుజురాబాద్ నియోజకవర్గం వీణవంక దాదాపు 1070 మంది రైతులు రుణాలు తీసుకున్నారని, అందులో రుణమాఫీ 495 మందికి అయింది, ఇంకా 50 శాతం మందికి రుణమాఫీ కాలేదని వివరించారు.
గత బీఆర్ఎస్ హయాంలో రెండు విడతల్లో రూ.29,114 వేల కోట్ల రుణమాఫీ చేశామని అన్నారు. రైతు బంధు పథకం లాంటి గొప్ప పథకాన్ని కేసీఆర్ తెచ్చారని గుర్తుకు చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతు బంధు పథకం రెండు సీజన్లలో ఎగ్గొట్టిందని, మూడో సీజన్లో రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తామని చెప్పి.. కేవలం రూ.12 వేల రూపాయలు వేశామని అంటున్నారని చెప్పుకొచ్చారు. ఇక రైతులకు ఇచ్చే బోనస్ పెద్ద బోగస్ అయ్యిందని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.