వరదల్లో చనిపోయింది 44 మంది.. అసెంబ్లీలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి వెల్లడి
తాజాగా కురిసిన భారీ వర్షాలు, సంభవించిన వరదలతో రాష్ట్రంలో మొత్తం 44 మంది చనిపోయారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు
దిశ, తెలంగాణ బ్యూరో : తాజాగా కురిసిన భారీ వర్షాలు, సంభవించిన వరదలతో రాష్ట్రంలో మొత్తం 44 మంది చనిపోయారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇందులో అత్యధికంగా ములుగు జిల్లాలోనే 17 మంది ఉన్నారని, హన్మకొండ జిల్లాలో ఆరుగురు, ఆసిఫాబాద్ జిల్లాలో నలుగురు చొప్పున ఉన్నారని తెలిపారు. మొత్తం 14 జిల్లాల్లో ప్రాణనష్టం జరిగిందన్నారు. వరదలపై అసెంబ్లీలో శుక్రవారం జరిగిన స్వల్పకాలిక చర్చలో భాగంగా మంత్రి ప్రశాంత్‌రెడ్డి పై వివరాలను వెల్లడించారు. మృతుల కుటుంబాల్లో రైతుబీమా లబ్ధిదారులు ఉంటే వారికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందుతుందన్నారు. మృతుల కుటుంబాలన్నింటికీ ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని, అందులో రూ. 4 లక్షలు ఎన్డీఆర్ఎఫ్ నిధుల నుంచి ఉంటుందన్నారు. రైతుబీమాతో వచ్చే పరిహారంతో దీనికి సంబంధం లేదని తెలిపారు.
వరద బాధిత ప్రాంతాల్లో 419 ఇండ్లు పూర్తిగా కూలిపోయాయని, ఏడున్నర వేల ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు. అలాంటి కుటుంబాలకు తక్షణ సాయంగా రూ. 10 వేల చొప్పున అందిస్తున్నామని, సింగరేణి సంస్థ సహకారంతో అదనంగా రూ. 17 వేలను ఇస్తున్నామని తెలిపారు. ఈ కుటుంబాలకు ఆదుకోడానికి ఆ జిల్లాల్లోని ప్రభుత్వ ఉద్యోగులు రెండు రోజుల వేతనాన్ని విరాళంగా ప్రకటించారని గుర్తుచేశారు. ఈ వరదల్లో పాడి పశువులు కూడా చనిపోయాయని తెలిపారు. ఇందులో 38 ఎద్దులు, 439 ఆవులు/గేదెలు, 399 గొర్రెలు, 81 వేలకు పైగా కోళ్ళు ఉన్నాయన్నారు. వీటి నష్టం సుమారు రూ. 19 కోట్లు ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు. మొత్తం పశుసంవర్ధక శాఖ పరిధిలో సుమారు రూ. 58 కోట్లు ఉంటుందని తెలిపారు.
వరదల కారణంగా రోడ్లు-భవనాల శాఖకు చెందిన పలు రహదారులు, బ్రిడ్జీలు, కల్వర్టులు దెబ్బతిన్నాయని మంత్రి పేర్కొన్నారు. రోడ్లు-భవనాల శాఖకు చెందిన 768 రోడ్లకు నష్టం జరిగిందని, ఇందులో 523 రోడ్లకు రూ. 253 కోట్లతో తాత్కాలికంగా మరమ్మత్తులు చేశామని, శాశ్వత పరిష్కారం కోసం ఇంకా రూ. 1,231 కోట్లు అవసరమవుతాయన్నారు. దెబ్బతిన్న రోడ్లలో జాతీయ రహదారుల అథారిటీకి చెందినవి 37 ఉన్నాయని, ఇందులో ఆరు రాజీవ్ రహదారిలో భాగమైనవని వివరించారు. పంచాయతీరాజ్ శాఖకు చెందిన 1,517 రోడ్లు దెబ్బతిన్నాయని, తాత్కాలిక మరమ్మత్తులకు రూ. 187 కోట్లు, పర్మనెంటు పనుల కోసం ఇంకా రూ. 1,339 కోట్లు అవసరమవుతాయన్నారు. మరో రెండు మూడు రోజుల్లో తాత్కాలిక మరమ్మత్తు పనులు కంప్లీట్ అవుతాయన్నారు.
విద్యుత్ శాఖకు కూడా వరదల కారణంగా నష్టం జరిగిందని, సుమారు 23 వేల స్తంభాలు, 3,405 ట్రాన్సఫార్మర్లు దెబ్బతిన్నాయని, వీటి రిపేర్ల కోసం రూ. 63 కోట్లు ఖర్చు కానున్నట్లు మంత్రి తెలిపారు. పురపాలక శాఖ పరిధిలో సైతం వరంగల్, నిర్మల్, పరకాల, కోరుట్ల, భూపాలపల్లి, జమ్మికుంట, ఖమ్మం, మహబూబాబాద్, భైంసా, నిజామాబాద్, పెద్దపల్లి, నర్సంపేట తదితర స్థానిక సంస్థలకు సుమారు రూ. 380 కోట్ల మేర నష్టం జరిగిందని, ఇందులో తాత్కాలిక మరమ్మత్తులకే రూ. 76 కోట్లు ఖర్చవుతుందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు రూ. 985 కోట్ల మేర రోడ్లు, నాలాలు దెబ్బతిన్నాయని, తాత్కాలిక మరమ్మత్తులకు రూ. 255 కోట్లు అవసరమవుతుందన్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే రూ. 500 కోట్ల తక్షణ సాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
పంటనష్టంపై మాత్రం సైలెంట్
వరదల కారణంగా అన్ని శాఖలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసిన ప్రభుత్వం వ్యవసాయ శాఖ పరిధిలోని పంట నష్టం గురించి మాత్రం మౌనంగా ఉన్నది. మంత్రి తన సమాధానంలో పంట నష్టం గురించి ప్రస్తావించలేదు. కోతకు గురైన భూమి కారణంగా పంటలకు జరిగిన నష్టం వివరాలను సేకరిస్తున్నామని, అధికారులు ఆ పనిలోనే ఉన్నారని, ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత తదుపరి నిర్ణయం ఉంటుందని సభకు వివరించారు. వరి పంటకు నష్టం లేదని నొక్కిచెప్పిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి.. ఈసారి వరి సాగు గతేడాది కంటే రికార్డు స్థాయిలో 64 లక్షల ఎకరాల్లో ఉంటుందని ఒకింత గర్వంగా ప్రకటించారు. విపక్షాలన్నీ పంట నష్టం గురించి ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఉంటే దానికి చెల్లించే పరిహారంపై స్పందించని మంత్రి ఇతర శాఖల వివరాలను మాత్రం ఏకరువు పెట్టారు.