ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే.. ఉపయోగాలేంటో వివరించిన మంత్రి పొన్నం

మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ రూరల్ మండలం తాహెర్ కొండాపూర్ లో ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫ్యామిలీ డిజిటల్ కార్డు వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.

Update: 2024-10-03 07:29 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రజలు ఒక్క కార్డుతోనే రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాలు అందాలన్న ఉద్దేశంతో ఫ్యామిలీ డిజిటల్ కార్డులను ప్రారంభించింది. సికింద్రాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి ఈ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించగా.. మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ రూరల్ మండలం తాహెర్ కొండాపూర్ లో ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫ్యామిలీ డిజిటల్ కార్డు వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.

ప్రతిఒక్కరూ ఇప్పటి వరకూ తమ రేషన్, ఆరోగ్య శ్రీ కార్డుల్లో లేని వివరాలను ఈ కార్యక్రమంలో నమోదు చేయించుకోవచ్చని తెలిపారు. వన్ స్టేట్ వన్ కార్డు లో భాగంగా.. కొత్తగా పెళ్లైన వారి, మృతి చెందినవారి వివరాలను అప్డేట్ చేయనున్నట్లు పేర్కొన్నారు. రేషన్, ఆరోగ్యంతో పాటు.. రైతు బంధు, రైతు బీమాకు కూడా ఈ కార్డు ఉపయోగపడుతుందన్నారు. ఇంటిలోని మహిళను యజమానిగా గుర్తించి.. ఫ్యామిలీ డిజిటల్ కార్డులను అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కుటుంబ సభ్యులందరి ఆరోగ్య వివరాలను ఈ డిజిటల్ కార్డులోనే పొందుపరుస్తారని చెప్పారు.

తెలంగాణలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ డిజిటల్ కార్డు సర్వేని ప్రారంభిస్తున్నామని, కుటుంబానికొక గుర్తింపు కార్డు అందజేస్తామని చెప్పారు. ఇప్పటి వరకూ టెక్నికల్ రీజన్స్ తో రుణమాఫీ కాని రైతుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం మాదిరి తాము లక్షరూపాయలను నాలుగు విడతలుగా ఇవ్వడం లేదని, అర్హులైన రైతులకు ఒకే విడతలో రుణమాఫీ చేశామన్నారు. డిజిటల్ కార్డుల సర్వేలో ఏమైనా తప్పులు జరిగితే అధికారుల దృష్టికి తీసుకు వెళ్లాలని, ఫలితంగా ఆ తప్పు మరోసారి జరుగకుండా చర్యలు తీసుకుంటారని తెలిపారు. 


Similar News