స్వామి రామానంద తీర్థకు నివాళి.. సీఎం రేవంత్ సందేశం ఇదే

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు స్వామి రామానంద తీర్థ జయంతి సందర్భంగా ఆ యోధుడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు.

Update: 2024-10-03 09:23 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు స్వామి రామానంద తీర్థ జయంతి సందర్భంగా ఆ యోధుడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ మేరకు గురువారం తెలంగాణ సీఎంవో అధికార ఖాతా ఎక్స్ వేదికగా వెల్లడించారు. హైదరాబాద్ సంస్థాన విలీనం కోసం పోరాడిన ధీరుడు, లోక్‌సభ సభ్యుడిగా, కార్మిక నేతగా రామానంద తీర్థ నిరాడంబర జీవితం యువతకు ఆదర్శప్రాయమని ఒక సందేశంలో కొనియాడారు. కాగా, స్వామి రామానంద తీర్థ నిజాంకు వ్యతిరేకంగా పోరాడి హైదరాబాద్ విమోచన ఉద్యమంలో నిర్మాణాత్మక పాత్ర పోషించారు. తన విద్యార్థి దశలో ఉండగానే 1920లో బాలగంగాధర్ తిలక్ కాలధర్మం చెందారన్న వార్త విని బ్రహ్మచారిగా తన జీవితాన్నంతా మాతృభూమికి అంకితం చేశాడు. 1932లో సన్యాస దీక్ష తీసుకున్నారు. ఆ సమయంలో ఈయనకు స్వామీ రామానంద తీర్థ అని నామకరణం చేశారు. ఆయన అసలు పేరు వెంటకరావు ఖేడ్గీకర్.

స్టేట్ కాంగ్రెస్‌ అనే సంస్థను నెలకొల్పడానికి స్వామీ ప్రయత్నం చేస్తుండగా నిజాం ప్రభుత్వం 1938లో నిషేధించింది. తాను సత్యాగ్రహం చేయగా ప్రభుత్వం ఆయన్ను బంధించి, నిజామాబాద్ కారాగారంలో నిర్బంధంలో ఉంచారు. 1942-1950 సంవత్సరాల మధ్య హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్నారు. హైదరాబాద్ సంస్థానాన్ని భాషా ప్రాతిపదికపై విభజించాలని విశాలాంధ్రను ఏర్పాటు చేయాలని 1953లోనే డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1957 నుంచి ఉస్మానియా సెనేట్‌లో శాశ్వత సభ్యులుగా కొంతకాలం ఉన్నారు. భూదాన్ ఉద్యమంలో పనిచేశారు. స్వామీ 1972వ తేదీన హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు.


Similar News