KCR నీతులు చెబుతుంటే వింతగా ఉంది.. పొంగులేటి సెటైర్
పదేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తికి కాళేశ్వరం ఎందుకు కూలిందో అర్ధం కాదా? అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు.
దిశ, తెలంగాణ బ్యూరో: పదేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తికి కాళేశ్వరం ఎందుకు కూలిందో అర్ధం కాదా? అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ నీతులు వల్లిస్తే విచిత్రంగా ఉన్నదంటూ ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కరీంనగర్ వరకు వెళ్లిన వ్యక్తి, కాళేశ్వరం ఎందుకు పోలేదని ప్రశ్నించారు. ఈక, తోక తెలిసిన వ్యక్తి నిర్మించిన ప్రాజెక్టు మూడేళ్లకే కుప్పకూలిందని విమర్శించారు. ‘‘పబ్లిక్ మెమొరీ ఈజ్ వెరీ షార్ట్’ అని ఏ మహానుభావుడు అన్నాడో కానీ, అది అక్షరాల నిజం అని మంత్రి వివరించారు. అధికారంలో నుంచి ప్రతిపక్షంలోకి రాగానే, ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు రైతులు, నీతులు గుర్తొచ్చాయని మండిపడ్డారు. రైతు ప్రేమికుడిగా పర్యటనలు, ప్రకటనలు ఉదరగొడుతున్నారన్నారు. కేసీఆర్ గతమూ, వర్తమానమూ అంతా నటన, అహంకారం నియంతృత్వమేనన్నారు. వర్షాభావ పరిస్థితులను ప్రకృతి వైపరీత్యాన్ని ప్రభుత్వ వైఫల్యంగా చూపడానికి, ప్రతిపక్ష నేత కేసీఆర్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రకృతి వైపరీత్యాలకు ఎవరూ అతీతులు కాదని వివరించారు.