KCR మాట నమ్మి బాగుపడ్డ ఒక్క వ్యక్తినైనా చూపించండి: మంత్రి పొంగులేటి
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శలు గుప్పించారు. శనివారం ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్‌లో ఆయన మాట్లాడుతూ..
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శలు గుప్పించారు. శనివారం ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్‌లో ఆయన మాట్లాడుతూ.. పదేళ్లలో హామీలు అమలు చేయడంలో కేసీఆర్ విఫలమయ్యారని.. అందుకే ప్రజలు ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు కర్రుకాల్చి వాత పెట్టారని అన్నారు. నేనే సీఎం అని కేసీఆర్ ఇంకా అనుకుంటున్నారని సెటైర్ వేశారు. తెలంగాణను కేసీఆర్ పదేళ్లు నిరంకుశంగా పాలించారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ మాట నమ్మి బాగుపడిన ఒక్కరినైనా చూపించండన్నారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం చేస్తామన్నారు.. మరీ నమ్మకాన్ని నిలబెట్టుకున్న విశ్వసనీయత కేసీఆర్‌కు ఉందా అని ప్రశ్నించారు.
తాను కాంగ్రెస్ పార్టీలో కంఫర్ట్ జోన్‌లో ఉన్నానని.. అలాంటిది తాను ఎందుకు పార్టీ మారుతానని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీకి ఏ విశ్వసనీయం ఉందని పొంగులేటి ఆ పార్టీలోకి వెళ్తాడని అన్నారు. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని కేసీఆర్ చెప్పడం అంతా ఉత్తిదేనని గులాబీ బాస్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని తాము ఎవరినీ ప్రలోభ పెట్టడం లేదని స్పష్టం చేశారు. ఎంపీ ఎన్నికలకు, బీఆర్ఎస్ నుండి వలసలకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని కొందరు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. తమది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని.. ఐదేళ్లు అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.