మహిళా ఉద్యోగుల కోసం ‘సాహస్’​

మహిళా ఉద్యోగుల భద్రత కోసం ‘సాహస్’ మైక్రో సైట్, సాహస్​ సాథీ చాట్ బోట్, సాహస్​ వాట్సాప్ లను తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.

Update: 2023-05-19 16:05 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: శాంతిభద్రతల పరిరక్షణ కోసం తెలంగాణ పోలీస్​శాఖ అమల్లోకి తెస్తున్న వినూత్న చర్యలు సర్వత్రా అభినందనలు అందుకుంటున్నాయని హోం మంత్రి మహమూద్ ​అలీ అన్నారు. రాష్ర్టం ఏర్పడి కేవలం తొమ్మిదేళ్లే అయ్యిందని చెబుతూ శాంతిభద్రతల పరిరక్షణలో మనం దేశంలోనే అగ్రగామిగా నిలబడటం ప్రశంసనీయమని చెప్పారు. పోలీసుశాఖ సిబ్బంది అంకితభావంతో పని చేస్తుండటం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. పనిచేసే చోట మహిళా ఉద్యోగినులు లైంగిక వేధింపులు, ఇతర సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తరచూ ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వాటి పరిష్కారానికి ‘సాహస్’ మైక్రోసైట్, సాహస్​ సాథీ చాట్ బోట్, సాహస్​ వాట్సాప్ లను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు తెలిపారు. దీనివల్ల పనిచేసే చోట మహిళా ఉద్యోగినులకు మరింత భద్రత ఏర్పడుతుందన్నారు. ఐటీసీ కాకతీయ హోటల్​లో జరిగిన కార్యక్రమంలో సాహస్​ను ప్రారంభించిన హోం మంత్రి మహమూద్​అలీ సాహస్​ అంటే తెలుగులో ధైర్యం అన్న అర్థం ఉందని చెబుతూ మహిళా ఉద్యోగినులకు ధైర్యాన్ని కల్పించటమే దీని ప్రధాన ఉద్దేశ్యమన్నారు.

శాంతిభద్రతల పరిరక్షణకు క్షేత్రస్థాయిలో పోలీసుశాఖ తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలనిస్తున్నట్టు చెప్పారు. నేరాలను మరింత సమర్థంగా నిరోధించటానికి పోలీసుశాఖ చేస్తున్న కృషిని అభినందించారు. డీజీపీ అంజనీ కుమార్​మాట్లాడుతూ సాహస్​ను అందుబాటులోకి తీసుకురావటం ద్వారా మహిళలు పని చేసే ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, సమస్యలకు పూర్తిగా అడ్డకట్ట వేయవచ్చన్నారు. ప్రస్తుతం గ్రేటర్​తెలంగాణలో మూడు లక్షల మందికి పైగా మహిళా ఉద్యోగులు వేర్వేరు సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నట్టు తెలిపారు. సాహస్​టీంలోని సభ్యులు ఈ అందరు ఉద్యోగులతో మాట్లాడటం ద్వారా సమస్యల పట్ల వారికి అవగాహన కల్పించాలని సూచించారు. సాహస్​స్టీరింగ్​కమిటీ మహిళా ఉద్యోగినుల్లో వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలు, పోలీసులకు ఎలా ఫిర్యాదులు చేయవచ్చన్న అంశాలపై అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున అవగాహనా సదస్సులు నిర్వహించాలని చెప్పారు. ఒక్క ప్రైవేట్​సంస్థలే కాకుండా ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినులకు కూడా దీని గురించి తెలిసేలా చూడాలన్నారు. సాహస్​రూపకల్పనలో కీలకపాత్ర వహించిన మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ షిఖా గోయల్​ మాట్లాడుతూ దేశంలోనే అత్యధికంగా ఎక్కువ శాతం మహిళా ఉద్యోగులు ఉన్న రాష్ర్టం మనదే అని చెప్పారు.

దీనికి ప్రధాన కారణం ఇక్కడ శాంతిభద్రతలు సురక్షితంగా ఉండటమే అని తెలిపారు. మహిళా ఉద్యోగినుల భద్రత, సమస్యల పరిష్కారం కోసం అమల్లోకి తీసుకువచ్చిన సాహస్​కార్యక్రమం దేశంలోనే మొదటిదన్నారు. సీఐఐ, ఐడబ్ల్యుఎన్​ఛైర్మన్​శేఖర్​రెడ్డి మాట్లాడుతూ ప్రతీ వ్యాపారవేత్త తన పరిశ్రమలో పనిచేసే మహిళలు పూర్తిస్థాయి భద్రతగా ఉండాలని కోరుకుంటారన్నారు. ఈ దిశలో పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవటం హర్షణీయమని చెప్పారు. కార్తికేయ గ్రూప్​ఆఫ్​ఇండస్ర్టీస్​సీఎండీ భగవతి బల్ద్వాన్​మాట్లాడుతూ మహిళా ఉద్యోగినుల భద్రత కోసం ప్రారంభించిన సాహస్​కు తమ వంతు సహకారం అందించటం సంతోషం కలిగిస్తోందన్నారు. కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, న్యాయవాదులు, వేర్వేరు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags:    

Similar News