టెక్నిప్‌ ఎఫ్‌ఎంసీ @ రూ.1250 కోట్లు ఇన్వెస్ట్‌

Update: 2023-05-20 15:07 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గ్లోబల్ కార్యకలాపాలకు హైదరాబాద్ ను కేంద్రంగా ఎంచుకున్న మరో రెండు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు. సాంప్రదాయ, పునరుత్పాదక ఇంధన రంగంలో అంతర్జాతీయంగా పేరొందిన ఫ్రెంచ్-అమెరికన్ ఆయిల్-గ్యాస్ దిగ్గజ కంపెనీ “టెక్నిప్‌ ఎఫ్‌ఎంసీ” గ్లోబల్ కార్యకలాపాలకు హైదరాబాద్ కీలక కేంద్రంగా మారనుంది. అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో “టెక్నిప్‌ ఎఫ్‌ఎంసి” కంపెనీ ఉన్నతాధికారుల బృందం సమావేశమైంది. శనివారం హ్యూస్టన్ లోని “టెక్నిప్‌ ఎఫ్‌ఎంసీ” క్యాంపస్ లో కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రస్ డాల్, ఇండియా హెడ్-మేనేజింగ్ డైరెక్టర్ హౌసిలా తివారీతో పాటు ఇతర అధికారులు కేటీఆర్ ను కలిశారు. తన సాఫ్ట్‌వేర్ గ్లోబల్ డెలివరీ సెంటర్ తో పాటు ప్రెసిషన్ ఇంజనీరింగ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని హైదరాబాద్ లో ప్రారంభించడానికి ఈ సమావేశంలో “టెక్నిప్‌ ఎఫ్‌ఎంసీ” నిర్ణయం తీసుకుంది. 3,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని సంస్థ తెలిపింది. తొలి దశలో రూ. 1250 కోట్లు పెట్టుబడిగా పెడుతుంది. 5400 కోట్ల రూపాయల విలువైన ఎగుమతులను హైదరాబాద్ కేంద్రంగా చేయబోతుంది.

అలియంట్ గ్రూపు.. 9 వేల కొత్త ఉద్యోగాలు

తెలంగాణలో ఉన్న వ్యాపార అనుకూల వాతావరణానికి మరో దిగ్గజ సంస్థ ఫిదా అయింది. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ అగ్రశ్రేణి గ్లోబల్ కన్సల్టింగ్, ఫైనాన్షియల్ సంస్థ ‘ఆలియంట్’ ప్రతినిధులను కలిశారు. శనివారం హ్యూస్టన్ లో ఉన్న కంపెనీ ప్రధాన కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌తో ఆలియంట్ గ్రూప్ సీఈఓ ధవల్ జాదవ్ సమావేశమయ్యారు. అనంతరం తమ విస్తరణ ప్రణాళికలను ప్రకటించారు. ఇందులో భాగంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా సెక్టార్ లో 9 వేల ఉద్యోగాలను కల్పిస్తామని ధవల్ జాదవ్ తెలిపారు. ఆలియంట్ ప్రకటనపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. టాక్స్, అకౌంటింగ్, ఆడిట్, సర్వీసెస్, ఐటీ టెక్నాలజీ రంగాల్లోని యువతకు అపార ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.

‘డబ్ల్యూటీఐటీసీ’ స్కై సోర‌ర్ లాంచ్ చేసిన మంత్రి కేటీఆర్‌

మంత్రి కేటీఆర్ అమెరికా ప‌ర్యట‌న‌లో భాగంగా, అగ్రరాజ్యం అమెరికా రాజ‌ధాని వాషింగ్టన్ డీసీ లో శనివారం జ‌రిగిన కార్యక్రమంలో వ‌రల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ `స్కై సోర‌ర్` ను లాంచ్ చేశారు. ప్రపంచ‌వ్యాప్తంగా ఉన్న తెలుగు ఐటీ సంస్థలు మాతృభూమి అభివృద్ధిలో భాగం చేయాల‌ని ‘ప్రపంచ‌ తెలుగు స‌మాచార సాంకేతిక మండ‌లి’ ఏర్పాటు చేసిన‌ చైర్మన్ సందీప్ కుమార్ మ‌ఖ్తలకు మంత్రి కేటీఆర్ అభినంద‌న‌లు తెలిపారు. ఫ్లైయింగ్ హై విత్ డ‌బ్ల్యూటీఐటీసీ అనే థీంతో రూపొందించి ఈ స్కై సోర‌ర్ ద్వారా డబ్ల్యూటీఐటీసీ కార్యక‌లాపాల గురించి విపులంగా తెలియ‌జేయ‌నున్నారు. ప్రపంచ‌వ్యాప్తంగా ఉన్న తెలుగు టెక్నోక్రాట్లను ఒక‌తాటిపైకి తెచ్చేందుకు ఏర్పడిన‌ వ‌ర‌ల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ (డబ్ల్యూటీఐటీసీ) తెలుగు రాష్ట్రాల‌లోకి పెట్టుబ‌డులు తేవ‌డం, ఎంట్రప్రెన్యూర్‌షిప్, స్టార్టప్‌లను ప్రోత్సహించ‌డం, వివిధ భాగ‌స్వామ్య ప‌క్షాల మ‌ధ్య స‌మ‌న్వయం ల‌క్ష్యంగా కృషి చేస్తోంది. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్‌, ప్రపంచ‌ తెలుగు స‌మాచార సాంకేతిక మండ‌లి చైర్మన్ సందీప్ మ‌ఖ్తల మాట్లాడుతూ త‌మ సంస్థలు, నైపుణ్యాల ద్వారా ప్రపంచ‌వ్యాప్తంగా గుర్తింపు పొందిన మ‌న ఐటీ నిపుణులు స్టార్టప్‌ల వైపు మొగ్గు చూపాల‌ని, స్వదేశంలో పెట్టుబ‌డులు పెట్టాల‌ని సూచించారు. నైపుణ్యవంతులైన తెలుగు వారికి ఎంతో వృద్ధి చెందే అవ‌కాశాలు ఉన్నాయ‌ని పేర్కొంటూ వాటిని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొనతం, విశ్వేశ్వర్ కాల్వల, వెంకట్ మంతెన, లక్స్ చేపురి, డ‌బ్ల్యూటీఐటీసీ కౌన్సిల్ సభ్యులు రమేష్ గౌడ్ చనగోని, ధర్మేంద్ర బొచ్చు, విజయ స్పందన, కరుణ, నిరంజన్, కిరణ్ మీగడ, రోనిత్ బండ, సూర్య విడియల, సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News