Konda Surekha: జీవో విడుదల చేసిన ప్రభుత్వం.. మంత్రి కొండా సురేఖ హర్షం
మామునూరు ఎయిర్ పోర్టు(Mamnoor Airport) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.205 కోట్లను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంపై మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) హర్షం వ్యక్తం చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: మామునూరు ఎయిర్ పోర్టు(Mamnoor Airport) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.205 కోట్లను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంపై మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) హర్షం వ్యక్తం చేశారు. ఎయిర్ పోర్టు ఏర్పాటు తన రాజకీయ ప్రస్థానంలో మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. వరంగల్ బిడ్డనైన తాను మంత్రిగా ఉన్న సమయంలో వరంగల్ ప్రజల చిరకాల వాంఛ అయిన మామునూరు ఎయిర్ పోర్టుకు మోక్షం లభించడం ఎంతో భావోద్వేగాన్ని కలిగిస్తున్నదన్నారు. పట్టువదలకుండా శ్రమించి అనుకున్నది సాధించిన సీఎం రేవంత్ రెడ్డికి ఆదివారం మీడియా ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. వర్షాకాలంలో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు పొంచి ఉన్న ముంపును నివారించేందుకు అవసరమైన పనులు చేపట్టే నిమిత్తం రూ.160.92 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం మరో జీవో విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు.
టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు నిమిత్తం చేపట్టిన భూసేకరణలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు 863 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం పట్ల తన నిబద్ధతన మరోసారి చాటుకున్నదన్నారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి దిశగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేపట్టిన పనులకు ఇది ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో సంక్షేమంలో స్వర్ణయుగాన్ని ఆవిష్కరించే దిశగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సమర్థవంతమైన కార్యాచరణనను అమలు చేయబోతున్నదని స్పష్టం చేశారు.