పాడి రైతుకు పోషణ కష్టం.. పాల ధర పెరిగినా నష్టమే..!

‘అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని’ అన్నట్టు తయారైంది పాడి రైతుల పరిస్థితి. పాల డెయిరీలు తమ వ్యాపారం కోసం ప్యాకెట్ పాలతో పాటు పాల పదార్ధాల ధరలను అమాంతం పెంచుతూ

Update: 2022-08-18 00:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: 'అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని' అన్నట్టు తయారైంది పాడి రైతుల పరిస్థితి. పాల డెయిరీలు తమ వ్యాపారం కోసం ప్యాకెట్ పాలతో పాటు పాల పదార్ధాల ధరలను అమాంతం పెంచుతూ వినియోగదారులపై భారం మోపుతున్నాయి. ఇదే క్రమంలో పాడి రైతుల నుంచి సేకరిస్తోన్న పాలకు మాత్రం కంపెనీలు ధరలను పెంచకపోవడంతో పాడి రైతులకు పాల ఉత్పత్తి నానాటికీ భారంగా మారుతోంది. దీంతో రాష్ట్రంలో పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. రాష్ట్రానికి రోజువారీకి అవసరమైన పాలను కర్ణాటకతో పాటు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడమే నిదర్శనం. పశువులకు అవససరమైన దాణా, కొబ్బరిపిండి, మినపపొట్టు, వరి గడ్డి ధరలు కూడా అధికంగా పలుకుతుండడంతో పశువుల పోషణ భారంగా మారుతోందని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలానికి చెందిన ఓ రైతు 'దిశ'తో అన్నారు.

సమయానికి అందని రూ.4 ఇన్సెంటివ్..

పాల ఉత్పత్తికి ప్రోత్సాహం కల్పించి, తద్వారా రాష్ట్ర అవసరాల మేర రాష్ట్రంలోనే పాల ఉత్పత్తిని చేయాలని భావించి తెలంగాణ సర్కారు లీటర్‌కు రూ.4ను ఇన్సెంటివ్ ఇస్తామని ప్రకటించింది. ప్రకటన బాగానే ఉన్నా అమలులో జాప్యంతో రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2020 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు దాదాపు రూ.70 నుంచి 80 కోట్ల మేర విజయ డెయిరీకి పాలు పోసే రైతులకే ఇన్సెంటివ్ బకాయిలు ఉండగా, ముల్కనూర్, కరీంనగర్ డెయిరీల్లో రూ.20 కోట్ల మేర కలిపి మొత్తం సుమారు రూ.100 కోట్ల వరకు రైతులకు రూ.4 ఇన్సెంటివ్ బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించిన సాయం సమయానికి అందకపోవడంతో క్షేత్రస్థాయిలో రైతులు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

క్వింటా తౌడు రూ.3 వేలు.. కొబ్బరిపిండి రూ.5 వేలు..

పశువులకు అవసరమైన దాణా ఖర్చు రోజు రోజుకు పెరుగుతోంది. దాణా ధరలు కరోనాకు ముందు, తరువాత అన్నట్టు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో క్వింటా తౌడు రూ.3 వేలు, కొబ్బరి పిండి రూ.5 వేలు, మక్కపిండి, పెసరపొట్టు రూ.2,300, పత్తి పిండి రూ.3,800, గోధుమలు రూ.2,400, బొబ్బెర పొట్టు రూ. 2,450 చొప్పున ధరలు ఉండగా, గతంలో ఉచితంగా లభించిన వరిగడ్డి ప్రస్తుతం ఒక్క గడ్డి కట్ట రూ.150 పలుకుతుంది. దీంతో పశువుల మెయింటనెన్స్ భారంగా మారి గ్రామీణ ప్రాంతాల్లోని క్రమంగా పాడి రంగంపై అనాసక్తి కనబరుస్తున్నారు.

పశువుల దాణాకు ఓ లెక్కుంది..

పశువులకు రైతులు పెడుతున్న దాణాకు, వచ్చే పాలకు ఒక లెక్కుంది. దీని ప్రకారం ఒక్క గేదెకు రెండు పూటలా కలిపి 12 కేజీల దాణా పెడితే ఒక్క పూటకు సుమారు 7 నుంచి 8 లీటర్ల పాలను ఇవ్వాలి. కానీ ప్రస్తుతం ఒక్క పూటకు 4 నుంచి 5 లేదా 6 లీటర్లు మాత్రమే పాల దిగుబడి వస్తోంది. దీంతో పశువులకు పెడుతున్న దాణా ఖర్చు, దిగుబడి వస్తున్న పాలకు వచ్చే నగదుతో నష్టం తప్ప లాభం రావడం లేదని పాడి రైతులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా ఆరోగ్యకరమైన గేదెను కొనుగోలు చేయాలంటే ప్రస్తుతం మార్కెట్‌లో రూ.లక్ష వరకు ధర పలుకుతోంది. ప్రభుత్వం రాయితీలో గేదెలను ఇస్తున్నామని చెబుతున్నా.. అవి మాటలకే పరిమితమయ్యాయి తప్పితే ఆచరణకు నోచుకోవడం లేదని రాష్ట్ర పాడి రైతు సంఘం ఆరోపిస్తోంది.


Similar News