జడ్చర్లలో అర్ధరాత్రి హైనా హల్చల్! 9మేకలపై దాడి చేయడంతో..
జడ్చర్ల పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి హైనా హల్చల్ చేసింది.
దిశ, జడ్చర్ల : జడ్చర్ల పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి హైనా హల్చల్ చేసింది. అడవి ప్రాంతాల్లో ఉండాల్సిన క్రూర జంతువు హైనా పట్టణంలో నడిబొడ్డులో గల వీధిలో తిరుగుతూ మూగజీవాలను చంపడంతో కాలనీ ప్రజలు బెంబలెత్తిపోయారు. జడ్చర్ల మున్సిపాలిటీలోని మూడో వార్డులో గల రాజీవ్ నగర్ కాలనీలో మటన్ వ్యాపారి అశోక్ కు చెందిన 9 మేకలను ఇంటి పక్కకు గల కాంపౌండ్ వాల్‌లో ఉంచాడు.
కాగా మంగళవారం అర్ధరాత్రి హైనా అకస్మాత్తుగా దాడి చేసి 9 మేకలను చంపేసింది. మేకల అరుపులు విన్న చుట్టుపక్కల వారు వచ్చి హైనాను బెదిరించే ప్రయత్నం చేయగా అది వారి పైకి తిరగబడడంతో భయభ్రాంతులకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మూడో వార్డు కౌన్సిలర్ సతీష్ అధికారులు, వెటర్నరీ డాక్టర్లకు సమాచారం అందించారు. దీంతో బుధవారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు మృతి చెందిన మేకలను పరిశీలించారు.
హైనా దాడి చేయడం వలనే మేకలు మృతి చెందాయని ధృవీకరించారు. బతుకు తెరువు కోసం తెచ్చుకున్న మేకలు హైనా దాడిలో మృతి చెందడంతో రూ.75 వేలు నష్టపోయానని వ్యాపారి అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపున ఆదుకోవాలని బాధితుడు వేడుకుంటున్నారు. జడ్చర్ల పట్టణ నడిబొడ్డులో హైనా సంచరించడం, దాడి కారణంగా మేకలు మృతిచెందడంతో ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది.