Meta: పౌర సేవలకు ఏఐ హెల్ప్.. మెటాకు తెలంగాణ సర్కార్ కు మధ్య భాగస్వామ్యం

మెటాతో తెలంగాణ ప్రభుత్వం కీలక భాగస్వామ్యం కుదుర్చుకుంది.

Update: 2024-09-05 11:44 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో మెరుగైన పౌర సేవలు అందించడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పౌర సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించుకోబోతున్నది. ఈ మేరకు సోషల్ మీడియా దిగ్గజం మెటా తెలంగాణ ప్రభుత్వంతో గురువారం రెండేళ్ల భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా ప్రభుత్వ విభాగాలు, ఏజెన్సీల సామర్థ్యం, ఉత్పాదకతను పెంపొందించడంతో పాటు పబ్లిక్ సర్వీస్, ఈ-గవర్నెన్స్‌లోని వివిధ అంశాలను మార్చడంపై ఇది దృష్టి సారించనున్నారు. మెటా పరిచయం చేసిన తాజా 'లామా 3.1 వెర్షన్'తో సహా మెటాకు చెందిన ఓపెన్-సోర్స్ జనరేటివ్ ఏఐ సాంకేతికతతో తెలంగాణ ప్రభుత్వం, మెటా కలిసి పని చేయనున్నాయి. ప్రత్యేక స్థానిక అవసరాలు, అపరిష్కృతంగా ఉన్న సంచలనాత్మక అంశాలకు ఏఐ ద్వారా పరిష్కారం చూపనున్నట్లు మెటా పేర్కొంది. కాగా తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏఐ రంగంపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఏఐ హబ్ గా తెలంగాణను తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు వేదికలపై చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ హైదరాబాద్ వేదికగా గ్లోబల్ ఏఐ సమ్మిట్ ను సైతం ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇదే రోజున ఫేస్ బుక్ మాతృ సంస్థ అయిన మెటాతో రాష్ట్ర ప్రభుత్వం ఏఐ సేవల విషయంలో ఒప్పందం కుదుర్చుకోవడం ఆసక్తిగా మారింది. 


Similar News