స్వశక్తితో బతికితే మహిళల ఆత్మగౌరవం మరింత పెరుగుతుంది : డీజీపీ జితేందర్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ భాగస్వామ్యంతో మహిళలకు మెగా జాబ్ మేళా నిర్వహించారు.

దిశ,ఉప్పల్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ భాగస్వామ్యంతో మహిళలకు మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఆదివారం నాగోల్ ఎస్వీఎం గ్రాండ్ హోటల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర డీజీపీ జితేందర్, సీపీ సుధీర్ బాబు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ సమాజంలో సగభాగం ఉన్న మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. స్త్రీలు కేవలం ఇంటికి పరిమితం కాకుండా ఉన్నత చదువులు చదివి, వారి అర్హతలకు తగిన విధంగా ఉన్నత ఉద్యోగ అవకాశాలు దక్కించుకోవాలని కోరారు. స్త్రీలు ఆత్మగౌరవంతో బతకడం ద్వారా వారి విలువ మరింతగా పెరుగుతుందని, స్వశక్తితో బతకడంతో అది రెట్టింపు అవుతుందని పేర్కొన్నారు.
రోజురోజుకూ ప్రపంచం మరింత కొత్త పుంతలు తొక్కుతుందని, అన్ని రంగాల్లోనూ పోటీతత్వం పెరుగుతుందన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ స్త్రీని గౌరవించే చోట దేవతలు కొలువై ఉంటారని అన్నారు. మహిళలు తమ నైపుణ్యాలను ఉపయోగించుకొని తమ స్వశక్తితో జీవించడం ద్వారా వారి ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం మరింతగా పెరుగుతాయని, అందుకు దోహదపడేలా ఈ జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ జాబ్ మేళా ద్వారా దాదాపు 3000 మంది మహిళలు ఉద్యోగ అవకాశాల కోసం నమోదు చేసుకోగా వారిలో విభిన్న అర్హతలు, నైపుణ్యాలు కలిగిన దాదాపు 2323 మంది ఉద్యోగాలు పొందినట్లు పేర్కొన్నారు.
ఈ జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు పొందిన మహిళలు తమ వృత్తిలో మరింతగా ఎదిగేందుకు అవసరమైన అన్ని రకాల తోడ్పాటును అందిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ లోని సభ్య కంపెనీలు గొప్ప మనసుతో ముందుకు వచ్చి ఎంతోమంది ఆశావహులైన మహిళలకు ఉద్యోగాలు కల్పించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి డీసీపీ పీవీ పద్మజ, యాదాద్రి డీసీపీ అక్షాంశ్ యాదవ్, ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్, క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు, అడ్మిన్ డీసీపీ ఇందిర, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసులు, ఉమెన్ సేఫ్టీ డీసీపీ ఉషా విశ్వనాథ్, రోడ్ సేఫ్టీ డీసీపీ మనోహర్, స్పెషల్ బ్రాంచ్ డీసీపీ జి.నరసింహారెడ్డి, ఎస్ఓటీ డీసీపీ రమణారెడ్డి, డీసీపీ శ్యామ్ సుందర్, సైబర్ క్రైమ్స్ డీసీపీ నాగలక్ష్మి, సెక్యూరిటీ ఫోరమ్ వాసుదేవ్ రావు, ఎస్ఎన్ఐఎస్టీ ఉమెన్స్ ఫోరం గ్రూప్ సీడీసీ డైరెక్టర్ డాక్టర్ రాధికానాథ్, సైబర్ సెక్యూరిటీ ఫోరమ్ ప్రోగ్రామ్ మేనేజర్ వంశీ, ఆర్కెఎస్సీ చీఫ్ కోఆర్డినేటర్ సావిత్రి పాల్గొన్నారు.