పది పరీక్షలకు సర్వం సిద్ధం.. డీఈవో విజయకుమారి

పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది.

Update: 2025-03-19 16:08 GMT
పది పరీక్షలకు సర్వం సిద్ధం.. డీఈవో విజయకుమారి
  • whatsapp icon

దిశ, మేడ్చల్ బ్యూరో : పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. ఈ నెల 21వ తేదీ నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణ, కేంద్రాల్లో వసతుల కల్పన తదితర అంశాలను మేడ్చల్ జిల్లా విద్యాశాఖాధికారి విజయకుమారి బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

పకడ్బందీగా ఏర్పాట్లు..

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో పది పరీక్షల కోసం 230 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో కొత్తగా 9 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో 903 హై స్కూళ్లలో చదివిన 47,322 మంది రెగ్యులర్ విద్యార్థులతో పాటుగా 608 మంది విద్యార్థులు ప్రైవేట్ గా పరీక్షలకు హాజరు కానున్నారు. ఇప్పటికే జిల్లాకు వచ్చిన పరీక్ష పత్రాలను 21 పోలీస్ స్టేషన్లలో భద్రపరిచారు. పరీక్ష నిర్వహణ కోసం 2769 మంది సిబ్బందిని కేటాయించారు. 9 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దించారు.

ఈ నెల 21 నుంచి పరీక్ష ఈ నెల 21వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగే పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటాయి. అయితే భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం పేపర్లను ఈ ఏడాది వేర్వేరుగా రెండు రోజుల్లో నిర్వహిస్తున్నారు. ఈ రెండు పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహిస్తారు. ఓఎంఆర్ పత్రం పై ముద్రించిన వ్యక్తిగత వివరాలను విద్యార్థులు పరిశీలించాలి. సరిగా లేకపోతే ఇన్విజిలేటర్ కు తెలియజేయాలి. ఓఎంఆర్ పత్రం పై ఉన్న గడిలో ఆన్సర్ బుక్ లెట్ సీరియల్ నంబర్ తప్పనిసరిగా రాయాలి. ప్రశ్నాపత్రం ఇవ్వగానే ప్రతి పేజీ పైన హాల్ టికెట్ నెంబర్ రాయాలి. ఆన్సర్ బుక్ లెట్ పై మాత్రం హాల్ టికెట్ నెంబర్, పేరు రాయరాదు. సంతకం చేయరాదు.

ప్రశ్న పత్రం పై క్యూ ఆర్ కోడ్..

పదో తరగతి ప్రశ్నపత్రం పై ఈసారి క్యూఆర్ కోడ్ తోపాటు ఒక సీరియల్ నంబరును ప్రతి పేజీపైనా ముద్రిస్తున్నారు. ఎక్కడైనా ప్రశ్నాపత్రం ముందే బయటకు వస్తే వెంటనే గుర్తించడానికి ఇంటర్ తరహాలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇంటర్, ఓపెన్ స్కూల్ సొసైటీ తరహాలో 24 పేజీల ఆన్సర్ బుక్ లెట్ ఇస్తారు. సైన్స్ ను ఈ సారి రెండు వేర్వేరు రోజుల్లో (భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం) నిర్వహిస్తున్నారు. ఈ రెండు పరీక్షలతో పాటు ఒకేషనల్ పరీక్షలకు 12 పేజీల బుక్ లెట్ ఇస్తారు.. ఈసారి అదనపు షీట్లు ఇవ్వరు.

హాల్ టికెట్లను డౌన్ లోడ్..

హాల్ టికెట్లను ఆయా పాఠశాలలకు ఇప్పటికే పంపించాం. విద్యార్థులు వైబ్ సైట్ (www.bsetelangana.gov.in) నుంచి కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఎదురైతే పరిష్కరించేందుకు హైదరాబాద్ లోని పరీక్షల విభాగం కార్యాలయంలో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 040 23230942 నంబరుకు ఫోన్ చేయవచ్చు. అదే విధంగా 8008003453 నంబరులో జిల్లా అధికారిని సంప్రదించవచ్చు.

5 నిమిషాల వరకు అనుమతి..

పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతాయి. అయితే 5 నిమిషాలు వరకు అలస్యమైనా అనగా, 9.35 గంటల వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. అయితే జిల్లాలో పరీక్ష కేంద్రం ఎక్కడుందో ముందు రోజే చూసుకుంటే మంచిది. ట్రాఫిక్ సమస్యలతో పాటు ఇంటి నుంచి పరీక్ష కేంద్రం వద్దకు వెళ్లే దూరం, సమయాన్ని అంచనా వేయవచ్చు. పరీక్ష కేంద్రంలోకి మొబైల్ ఫోన్ లు, ఎలక్ట్రానిక్ గాడ్జీట్స్ లకు అనుమతి లేదు. అభ్యర్థులు హాల్ టికెట్, పరీక్ష ప్యాడ్, పెన్ , పెన్సిల్, స్కేలులకు మాత్రమే అనుమతి ఉంది. పరీక్ష సమయంలో విద్యార్థుల పై ఒత్తిడి లేకుండా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని డీఈవో విజయకుమారి తెలియజేశారు.


Similar News