మున్సిపల్ బిల్లు పాస్
మేడ్చల్ జిల్లాలో కొత్తగా మూడు మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో బిల్లు పాసైంది.

దిశ, మేడ్చల్ బ్యూరో : మేడ్చల్ జిల్లాలో కొత్తగా మూడు మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో బిల్లు పాసైంది. మేడ్చల్ నియోజకవర్గంలో మరో మూడు (అలియాబాద్, మూడు చింతలపల్లి, ఎల్లంపేట) మున్సిపాలిటీల ఏర్పాటుకు అసెంబ్లీలో మున్సిపల్ సవరణ చట్టం బిల్లు 2025ను ప్రవేశపెట్టింది.
ఈనెల 25న మంగళవారం అసెంబ్లీలో బిల్లుపై చర్చించి ఆమోదం తెలపగా, బుధవారం శాసన మండలిలోనూ బిల్లు పాసైంది. దీంతో జిల్లాలో ప్రస్తుతం ఉన్న 9 మున్సిపాలిటీలకు మరో మూడు మున్సిపాలిటీలు కొత్తగా జతయ్యాయి. ఈ మూడు మున్సిపాలిటీల ఏర్పాటుతో జిల్లాలో గ్రామపంచాయతీలు పూర్తిగా కనుమరుగైనట్లైంది. ఇక మీదట మేడ్చల్ జిల్లా పూర్తిగా అర్బన్ ప్రాంతంగా మారిపోనుంది.
అత్యధిక మున్సిపాలిటీలు ఇక్కడే..
మేడ్చల్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా మున్సిపాలిటీలు ఉన్నాయి. నాలుగు కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలతో రాష్ట్రంలోనే ఎక్కువ మున్సిపాలిటీలు ఉన్న జిల్లాగా ఖ్యాతి గడించింది. బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట నాలుగు కార్పొరేషన్లతో పాటు దుండిగల్, గుండ్ల పోచంపల్లి, మేడ్చల్, తూంకుంట, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్ కేసర్, కొంపల్లి 9 మున్సిపాలిటీలను గత మున్సిపల్ ఎన్నికలకు ముందు ఏర్పాటు చేశారు. తాజాగా అలియాబాద్, ఎల్లంపేట, మూడు చింతలపల్లి మూడు మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారు.
34 జీపీలతో మూడు మున్సిపాలిటీలు..
జిల్లాలో ఉన్న 34 గ్రామపంచాయితీలను కలుపుతూ కొత్తగా మూడు మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారు. మేడ్చల్ మండలంలో ఉన్న ఎల్లంపేట గ్రామపంచాయతీ కేంద్రంగా మేడ్చల్ మండలంలోని 14 గ్రామాలను కలుపుతూ మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. అదే విధంగా శామీర్ పేట మండలంలోని అలియాబాద్ గ్రామపంచాయతీ కేంద్రంగా 6 గ్రామాలను విలీనం చేస్తూ మున్సిపాలిటీని ఏర్పాటు చేయగా, మూడు చింతలపల్లి మండల కేంద్రంగా 14 గ్రామాలను కలుపుతూ మూడు చింతలపల్లి మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు.
పాలన సౌలభ్యం కోసమే..
జిల్లాలో ఘట్ కేసర్, కీసర, శామీర్ పేట, మేడ్చల్, మూడు చింతలపల్లి ఐదు గ్రామీణ మండలాలు మాత్రమే ఉండేవి. అయితే గతేడాది సెప్టెంబర్ లో ఈ ఐదు మండలాల నుంచి 28 గ్రామాలను సమీప మున్సిపాలిటీలలో విలీనం చేశారు. ఈ విలీనం వల్ల ఘట్ కేసర్, కీసర మండలాల్లో ఉన్న గ్రామాలన్నీ మున్సిపాలిటీలలో విలీనమయ్యాయి. ఆ రెండు మండలాలు పోను మిగతా మూడు మాత్రమే గ్రామీణ మండలాలు మిగిలాయి. దీంతో జిల్లా పరిషత్ ఏర్పాటు చేయాలన్నా.. పంచాయతీ రాజ్ వ్యవస్థను కొనసాగించాలన్నా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి.
జిల్లా పరిషత్ పాలక మండలి ఏర్పాటు కోసం సరిపడా జెడ్పీటీసీలు లేకుండా పోయారు. ఉదాహరణకు జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఇద్దరు జెడ్పీటీసీలు కావాల్సి ఉంటుంది. ప్రస్తుత మండలాల ప్రకారం ఆ తర్వాత ఒక్క జెడ్పీటీసీ సభ్యుడు మాత్రమే మిగులుతారు. అదే సమయంలో జెడ్పీలో వివిధ శాఖలపై సమీక్షించేందుకు ఏడు రకాల కమిటీలు ఉంటాయి. వీటికి ఒక్కో జెడ్పీటీసీ సభ్యులు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. ముగ్గురు జెడ్పీటీసీ సభ్యుల కోసం జెడ్పీ సీఈఓ, డీపీఓ, డీఎల్పీఓ, ఎంపీడీఓలు, ఎంపీఓ, ఇతర సిబ్బంది, అధికారులు ప్రత్యేక వ్యవస్థ కావాలి.
ముగ్గురు జెడ్పీటీసీల కోసం జెడ్పీ సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. వీటన్నింటి నేపథ్యంలో జిల్లాను మొత్తం పట్టణ ప్రాంతంగా మారిస్తే మంచి ఫలితం ఉంటుందని అంచనా వేసి కొత్తగా మిగిలిన 34 గ్రామ పంచాయతీలతో మూడు మున్సిపాలిటీలను ఏర్పాటు చేయాలని స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. దీంతో కొత్తగా ఎల్లంపేట, అలియాబాద్, మూడు చింతలపల్లి కేంద్రాలుగా మూడు మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయా మున్సిపాలిటీలలో విలీన గ్రామలు ఇలా ఉన్నాయి.
మండలం మున్సిపాలిటీ విలీన గ్రామాలు
శామీర్ పేట అలియాబాద్ అలియాబాద్, లాల్ గాడి మలక్ పేట్, మజీద్ పూర్, మురహరిపల్లి, తుర్కపల్లి, యాదారం
మూడుచింతలపల్లి మూడుచింతలపల్లి అద్రాస్ పల్లె, అనంతారం, జగ్గంగూడ, కేశవాపూర్, కేశవరం, కొల్తూర్, లక్ష్మాపూర్, లింగాపూర్ తండా, మూడు చింతలపల్లి, నాగిశెట్టి పల్లి, నారాయణ్ పూర్, పోతారం, ఉద్దేమర్రి, పొన్నాల్
మేడ్చల్ ఎల్లంపేట డబీల్ పూర్, మైసిరెడ్డి పల్లి, కొనాయి పల్లి, నూతన్ కల్, శ్రీరంగవరం, బండ మాదారం, లింగాపూర్, రావల్ కోల్, సైదోనిగడ్డ తండా, సోమారం, రాజ్ బొల్లారం, రాజ్ బొల్లారం తండా, ఘన్ పూర్, ఎల్లంపేట