ఎవరిచ్చారు..? ఎందుకిచ్చారు..?
చెరువుల ఆక్రమణకు సహకరించిన యంత్రాంగం వివరాలను హైడ్రా సేకరిస్తోంది.
దిశ, మేడ్చల్ బ్యూరో : చెరువుల ఆక్రమణకు సహకరించిన యంత్రాంగం వివరాలను హైడ్రా సేకరిస్తోంది. శిఖం భూముల్లో భవన నిర్మాణాలను ఎవరు నిర్మించారు.. ? ఇందుకు తోడ్పాటునందించిన అధికారులు, ఉద్యోగులను గుర్తించే పనిలో నిమగ్నమైంది. శిఖం భూముల్లో అక్రమ కట్టడాలను ప్రోత్సహించింది ఎవరు..? నిర్మాణాలకు అనుమతులు ఎలా ఇచ్చారు..? ఎన్వోసీలు ఎవరు జారీ చేశారు..? అని హైడ్రా ఆరా తీస్తోంది.
అడ్డగోలుగా ఆక్రమణలు..ఎన్వోసీలు...
చెరువు శిఖం భూముల్లో అడ్డగోలుగా ఎన్వోసీలు జారీ అయ్యాయి. దీంతో ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలో విచ్చల విడిగా ఆక్రమణలు వెలిశాయి. జిల్లాలో 620 చెరువులు ఉండగా, వాటిలో 80 శాతం చెరువులు కబ్జాలకు గురయ్యాయి. చెరువు శిఖం భూములు ఆక్రమణలకు గురవుతున్నా చర్యలు లేకపోగా.. డబ్బులు తీసుకొని ఇరిగేషన్ శాఖ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్లు (ఎన్వోసీ) ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
హెచ్ఎండీఏ అధికారులు సైతం అనుమతుల జారీలో లోపభూయిష్టంగా వ్యవహరించడంతో నీటి పారుదల శాఖ అధికారులకు ఇదో ప్రధాన ఆదాయ వనరుగా ఉందనే చర్చ కొనసాగుతోంది. కుత్బుల్లాపూర్ లో ఇందుకోసం ఓ రిటైర్డ్ అధికారిని నియమించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే కొందరు నీటి పారుదల శాఖ ఇంజనీర్లు నిజాయితీగా వ్యవహరిస్తున్నా రాజకీయ ఇతరాత్ర ఒత్తిడిలకు తలొగ్గి కబ్జా రాయుళ్లకు ఎన్ వోసీలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల ఇరిగేషన్ ఇంజినీర్ల సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ ఎన్వోసీలు సృష్టించినట్లు తెలిసింది.
ఇటు కూల్చివేతలు.. అటు చర్యలు
చెరువు శిఖంలో అక్రమ నిర్మాణాలకు సహకరించారన్న అభియోగం ఎదుర్కొంటున్న నలుగురు మేడ్చల్ జిల్లా అధికారులపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి క్రిమినల్ కేసులు నమోదు చేసిన విషయం విధితమే. బాచుపల్లి మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, జిల్లా ఇన్ చార్జీ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, బాచుపల్లి తహసీల్దార్ పుల్ సింగ్ తో పాటు హెచ్ఎండీఏ సహాయ ప్లానింగ్ అధికారి సుధీర్ కుమార్ లపై కేసులు నమోదయ్యాయి. కాగా ఇప్పటికే నిజాం పేట మున్సిపల్ కమిషనర్ రామక్రిష్ణపై బదిలీ వేటు పడింది.
ఈ క్రమంలోనే హైడ్రా కమిషనర్ ఒకవైపు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తూనే... మరోవైపు వాటికి సహకరించిన అధికార యంత్రాంగంపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా జిల్లాలో పెద్ద ఎత్తున చెరువులను ఆక్రమించుకొని బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్ మెంట్లు వెలిశాయి. కొందరు ఫామ్ హౌజ్ లు ఏర్పాటు చేసుకోగా మరికొందరు విద్యా సంస్థలను నెలకొల్పారు. ఈ అక్రమ నిర్మాణాలకు గతంలో ఆయా ప్రాంతాలలో పనిచేసిన అధికార యంత్రాంగం సహకరించడం వల్లనే సాధ్యమైందన్నది జగమెరిగిన సత్యం. దీంతో కూల్చివేతలతోపాటు సహకరించిన అధికారులపైన కూడా చర్యలు తీసుకున్నట్లయితే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాదని హైడ్రా అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఉదాహరణలు ఇవీ..
– బాచుపల్లి లోని సర్వే నెంబర్ 134లోని మూడెకరాల ఎర్రకుంట చెరువు బఫర్ జోన్, ఎఫ్ టీఎల్ స్థలాలను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు వెలిశాయని ఆగస్టు 1వ తేదీన హైడ్రాకు ఫిర్యాదు అందింది. దీంతో ఆగస్టు 15వ తేదీన వాటిని నేలమట్టం చేశారు. అయితే అక్రమ కట్టడాలకు సహకరించినది ఎవరని ఆరా తీసి బాధ్యులైన నిజాంపేట మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, సర్వేయర్, మేడ్చల్ జిల్లా సర్వే ఆఫ్ ఏడీ పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హైడ్రా సిఫారసు చేయడంతో ఆ నలుగురిపైన కేసులు నమోదయ్యాయి.
- జీడి మెట్లలో ఫాక్స్ సాగర్ చెరువు దగ్గర నిర్మాణాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఈ నెల 28న పరిశీలించారు. ఫాక్స్ పాగర్ 70 ఎకరాలకు పైగా కబ్జా అయినట్లు గుర్తించారు. చెరువు దగ్గర వెలిసిన అక్రమ నిర్మాణాలకు ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న అధికారులు, కిందిస్థాయి ఉద్యోగులు అండదండలు ఉన్నట్లు స్పష్టమైంది. నిబంధనలకు విరుద్దంగా ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో భారీ కట్టడాలను నిర్మిస్తున్నా నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) జారీ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో ఫాక్స్ సాగర్ చెరువు ఆక్రమణలో సూత్రధారులేవరు..? పాత్రధారులేవని తేల్చే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.