మేడ్చల్ జిల్లాను అభివృద్ది చేద్దాం

ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఐకమత్యంతో పనిచేసి మేడ్చల్ జిల్లా అభివృద్దికి కృషి చేద్దామని దిశ చైర్మన్, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.

Update: 2025-01-08 15:56 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో : ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఐకమత్యంతో పనిచేసి మేడ్చల్ జిల్లా అభివృద్దికి కృషి చేద్దామని దిశ చైర్మన్, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన సమన్వయం ముఖ్యమన్నారు. గతంలో కేంద్ర పథకాలు నేరుగా అమలు చేయకుండా, రాష్ట్రాలకే బాధ్యతలు అప్పగించేవన్నారు. కేంద్రం నిధులను మంజూరు చేసినా రాష్ట్రాలు వాడుకునే స్థితిలో ఉండేవి కావన్నారు. దీంతో నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక, కేంద్ర సంక్షేమ పథకాలను నేరుగా అర్హులకు అందజేస్తున్నట్లు తెలిపారు.

     బుధవారం మేడ్చల్ మల్కాజ్ గిరి కలెక్టరేట్ లో జిల్లా అభివృద్ది సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశం జరిగింది. దిశ కార్యదర్శి, జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు, ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, కేపీ వివేకానంద, అరికెపూడి గాంధీ, మర్రి రాజశేఖర్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, అదనపు కలెక్టర్ రాధిక గుప్తా, గ్రామీణాభివృద్ది శాఖ అధికారి సాంబశివరావులతో కలిసి ఎంపీ, దిశ చైర్మన్ హోదాలో ఈటల రాజేందర్ కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ శాఖలకు వచ్చే నిధులు, ఇతర అంశాలపై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు నివేదిక సమర్పించగా, ఎమ్మెల్యేలు సమస్యలను ఏకరువు పెట్టారు.

దోమలకు క్యాపిటల్ గా మల్కాజ్ గిరి : మర్రి

మల్కాజ్ గిరిలో చెరువులు కాలుష్యకారకాలుగా మారాయని, కోర్టు కేసులను బూచీగా చూపి చెరువుల్లో కలుస్తున్న మురుగునీటి సమస్యను పరిష్కరించడంలేదని మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు.ఇండ్లను కూల్చడంలో చూపిన శ్రద్ధ, చెరువుల సుందరీకరణపై చూపడంలేదని విమర్శించారు. మచ్చబొల్లారంలో చెత్త డంపింగ్ యార్డు కోసం 2 ఎకరాలు కేటాయిస్తే 11 ఎకరాలను కబ్జా చేసి, ఆ స్థలాన్ని అద్దెలకిస్తూ కొందరు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అక్కడ చెత్తను క్లీయర్ చేయకపోగా ఇతర ప్రాంతాల నుంచి నిర్మాణ వ్యర్థాలను డంప్ చేస్తున్నారని అన్నారు. స్వచ్ఛభారత్ తో నిర్మించిన టాయిటెట్లలో నిర్వహణ లోపంతో దుర్గంధం వెదజల్లుతోందన్నారు.

    చెరువులు, చెత్త వ్యర్థాలు, టాయిలెట్ల వల్ల దోమలు వృద్ది చెంది, మల్కాజ్ గిరి నియోజకవర్గం దోమలకు క్యాపిటల్ గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా డ్రైనేజీ ఔట్ లెట్లు లేకుండానే హై రెజ్డ్ అపార్ట్ మెంట్లకు అనుమతులు ఇస్తున్నారని ఈ విషయమై మున్సిపల్ ఉన్నతాధికారులు అనేక మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి రెండు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కోరగా కలెక్టర్ కేటాయించినట్లు తెలిపారు. దీనిపై మర్రి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం స్పందించిన ఈటల జీహెచ్ఎంసీ అధికారులు సమావేశానికి వచ్చారా..? అని అరా తీయగా, ఎవరూ రాలేదని సమాధానం చెప్పడంతో అసహనం వ్యక్తం చేశారు. జవహర్ నగర్ చెత్త డంపింగ్ యార్డు వల్ల 17 కిలో మీటర్ల మేర భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని, వచ్చే సమావేశానికి జీహెచ్ఎంసీ అధికారులను పిలవాలని ఎంపీ ఆదేశించారు.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మౌలిక వసతులు కల్పించాలి : వివేక్

జిల్లాలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మౌలిక వసతులు కల్పించాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. తాగునీరు, విద్యుత్, రోడ్లతో పాటు సమీప ప్రాంతంలో ప్రార్థన మందిరాలు,హెల్త్ సెంటర్, అంగనివాడీలు, స్కూళ్లు, శ్మశాన వాటికలు నిర్మించాలన్నారు. మూసీ పరీవాహక ప్రాంత వాసులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయిస్తామని ప్రభుత్వం చెబుతుందని, స్థానికులకు 10 శాతం ఇండ్లను కేటాయించాలని కోరారు. కుత్బుల్లాపూర్ లో ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ కోసం రూ.26 కోట్లు మంజూరయ్యాయని, నిర్మాణ పనులను చేపట్టాలని వివేక్ కోరారు. మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ.. కీసర, చీర్యాల, తుర్కపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో కరెంట్, తాగునీటి సరఫరా లేదని, రోడ్లు నిర్మించాలని కోరారు. అర్హులకు బ్యాంకు రుణాలు ఇప్పించేందుకు బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు.

జీహెచ్ఎంసీ అధికారులను పిలువాలి : లక్ష్మారెడ్డి

జీహెచ్ఎంసీ ప్రాంతంలో జిల్లా ఎక్కువ భాగం విస్తరించి ఉందని, జిల్లా సమావేశాలకు జీహెచ్ఎంసీ అధికారులను పిలువాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో అవినితి పెరిగిపోయిందన్నారు. అదే విధంగా ఉప్పల్ లో సర్కారు దవాఖాన్లలో వైద్యులు లేరని, నర్సులే దిక్కన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు అధ్వాన్నంగా ఉన్నాయని అన్నారు. ఢిల్లీ పబ్లిక్, పల్లవి లాంటి కార్పొరేట్ స్కూళ్లలోనే నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు, యూనిఫాంలు విక్రయిస్తున్నారని ఆరోపించారు. వాటిపైన చర్యలు తీసుకోవాలని కోరారు.

    కార్పొరేట్ స్కూళ్ల ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదన్నారు. మల్కాజ్ గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ మాట్లాడుతూ..నియోజకవర్గంలో రూ.2.90 కోట్లను మన ఊరు మన బడిలో భాగంగా పాఠశాలల అభివృద్ది కోసం కేటాయించినా ఇప్పటి వరకు రూ.90 లక్షలే మంజూరు చేశారని, దీంతో పాఠశాలల పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనూ మన ఊరు మన బడి లో భాగంగా చేపట్టిన పనులు మధ్యలోనే నిలిచిపోయాయని స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. స్కూల్స్, ఆసుపత్రుల, గ్రంథాలయాల కోసం ప్రభుత్వ భూములను కేటాయించాలని కోరారు. సీఎస్ఆర్, మైనింగ్ తో పాటు ప్రభుత్వ నిధులను వెచ్చించి భవనాలను నిర్మించాలన్నారు. ప్రభుత్వ స్కూళ్లు, ఆసుపత్రులపై మూడు నెలలకోసారి ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలన్నారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత ప్రమాణాలను పాటించాలని ఎమ్మెల్యే గాంధీ సూచించారు.  


Similar News