మొదటిరోజు ఆహ్లాదంగా ప్రారంభమైన ఉద్యాన్ ఉత్సవ్

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో జనవరి 2 నుండి జనవరి 13 వరకు ప్రతిరోజూ ఉదయం10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జరగనున్న ఉద్యాన్ ఉత్సవ్ మొదటి రోజు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభించారు.

Update: 2025-01-02 16:28 GMT

దిశ, తిరుమలగిరి : బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో జనవరి 2 నుండి జనవరి 13 వరకు ప్రతిరోజూ ఉదయం10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జరగనున్న ఉద్యాన్ ఉత్సవ్ మొదటి రోజు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఉద్యాన్ ఉత్సవ్ లో డిపార్ట్మెంట్ అఫ్ హార్టికల్చర్ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఐసీఏఆర్, ఎస్కేఎల్ టీహెచ్ యూ, డాక్టర్ వైఎస్ ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ తదితర ఎన్ జీ ఓ సంస్థలు, కమ్యూనిటీ ఆర్గనైజషన్ ల నుండి దాదాపు 50 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ ను ప్రగతిశీల రైతు సురేష్ లాంఛనంగా ప్రారంభించారు. గురువారం ప్రారంభమైన ఉత్సవాలలో సుమారు 6 వేల మంది సందర్శకులు వివిధ ప్రాంతాల నుండి హాజరయ్యారు.

    ఈ కార్యక్రమానికి ఆయా పాఠశాలల విద్యార్థులు, ఎన్ సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్స్ తో పాటు అనేక మంది సందర్శకులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న పలువురు అధికారులు మాట్లాడుతూ మొదటి రోజులో భాగంగా రైతు సాధికార సమితి, ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ నిర్వాహిత సహజ వ్యవసాయ శాస్త్రవేత్తలు సహజ వ్యవసాయం, సుస్థిర హార్టికల్చర్ పద్ధతులు, ఆలుగడ్డ, అల్లం పంట నిర్వహణ పద్దతులు ఆఫ్ సీజన్లో కూరగాయల పంటల సాగు, డ్రై ఫ్లవర్ సాంకేతికత అంశాలపైన వర్క్ షాప్ నిర్వహించినట్లు తెలిపారు. ప్రకృతి ఔత్సాహికులకు, ఉద్యానవన ప్రేమికులను మంత్రముగ్ధులను చేసే దృశ్యాలను అందిస్తూ పుష్పాలు, పుష్పేతర ప్రదర్శనలు విస్తృత శ్రేణిని ప్రదర్శించడానికి ఈ ఉద్యాన ఉత్సవ్ ఒక ప్రత్యేక వేదికగా నిలిచిందని అన్నారు.

    అనంతరం ఒడిశా సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో శంఖవదనం, రామప్ప, ఛాదేయ మహారాష్ట్ర వారి లావాని, కోలి, వాగ్య మురళి నృత్యం, తెలంగాణ వారి మాధురి, బోనాలు, లంబాడి నృత్యాలు, మధ్య ప్రదేశ్ తాత్యాగోండి, కర్మ, దందర్ వంటి జ్ఞానపద, ఆదివాసి నృత్యాలు ప్రదర్శించారు. అదే విదంగా మహాభారతంలోని శ్రీకృష్ణ రాయబార ఘట్టాన్ని ప్రదర్శించి సందర్శకులను ఎంతో అలరించారు. నేటి నుండి జనవరి 13 వరకు ప్రతి రోజూ వివిధ వర్కుషాప్ లు, సాంస్కృతిక కార్యక్రమాలు, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

     ఈ కార్యక్రమంలో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ జాయింట్ కార్యదర్శి సామ్యూల్ ప్రవీణ్ కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శరవణన్ రాజ్, ఐఐసీఏఆర్, ఏటీఏఆర్ ఐ డైరెక్టర్ డాక్టర్ షైక్ మీరా, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, తెలంగాణ ఏడీఏ హుస్సేన్ బాబు, అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అడిషనల్ కమిషనర్ సంజయ్ కుమార్, రాష్ట్రపతి భవన్ డైరెక్టర్ శివేంద్ర చతుర్వేది, రాష్ట్రపతి భవనం పబ్లిక్ రిలేషన్స్ అధికారి కుమార్ సమరేష్, రాష్ట్రపతి నిలయ అధికారి డాక్టర్ కె. రజని ప్రియ తదితరులు పాల్గొన్నారు. 


Similar News